టీటీడీ పేరుతో నిలువు దోపిడీ..!
#TTD, #Tirumala, #TicketScam, #DevoteesAlert, #AndhraPradesh
మరీ ఇంత దారుణమా.. తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలంటే.. 20 వేల రూపాయలు చెల్లించాలా.. నిజానికి ఇంత ధర ఎక్కడా లేదు. మరి ఇదేంటి అనుకుంటున్నారా.. తిరుమల శ్రీవారి దర్శనం పేరుతో దళారుల దోపిడీకి ఇదో ఉదాహరణ మాత్రమే. ఒక్క టికెట్ అక్షరాల 16 వేల 500 రూపాయలు. అవును.. అక్షరాల నిజమే. ఒక్క టికెట్ ధర 16 వేల 500 రూపాయలు. అదేంటి.. శ్రీవారిని దగ్గరగా చూసే శ్రీవాణి ట్రస్ట్ టికెట్ కూడా రూ.10,500 మాత్రమే కదా.. మరి ఈ రూ.16,500 టికెట్ ఏమిటీ అనుకుంటున్నారా.. అదే దళారుల మాయ.
తిరుమల శ్రీవారి దర్శనం పేరుతో సోషల్ మీడియాలో నిలువు దోపిడీ చేస్తున్నారు దళారులు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనం కోసం కోట్ల మంది భక్తులు ఎదురు చూస్తుంటారు. ఇక పండుగ రోజుల్లో అయితే.. లెక్కే లేదు. స్వామి పిలుపు వస్తే చాలు అనుకుంటారు. నిజానికి శ్రీవారి దర్శనానికి ఎలాంటి దళారులను నమ్మవద్దని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు పదే పదే ప్రకటనలు చేస్తున్నారు. కానీ కొందరు మాయగాళ్లు మాత్రం.. శ్రీవారి దర్శనం పేరుతో భక్తులను నిలువునా మోసం చేస్తున్నారు. శ్రీవారికి సంబంధించిన అన్ని టికెట్లను టీటీడీ ఆన్‌లైన్‌లోనే విడుదల చేస్తుంది. ఇదే దళారులకు వరంగా మారింది.
టీటీడీ పేరుతో దళారులు రెచ్చిపోతున్నారు. ఆన్‌లైన్‌లో బుకింగ్ చేసుకోవడం చేతకానీ వారినే లక్ష్యంగా చేసుకుంటున్నారు మాయగాళ్లు. కేవలం సెకన్ల వ్యవధిలోనే టికెట్లు అయిపోతాయి.. మీకు ఒక్క టికెట్ కూడా రాదు.. అదే మేము అయితేనా.. అంటూ మాయ మాటలు చెబుతున్నారు. సాధారణంగా తిరుమల శ్రీవారి దర్శనం టికెట్లు 3 నెలలు ముందే టీటీడీ విడుదల చేస్తుంది. మార్చి నెలలో జూన్ కోటా విడుదల చేశారు. ఏప్రిల్ 18 నుంచి 25 వ తేదీ వరకు జులై కోటా విడుదల చేస్తారు. జూన్ నెల టికెట్లు ఇప్పటికే బుకింగ్ అయిపోయాయి. కానీ దళారులు మాత్రం ఇప్పటికీ టికెట్లు ఉన్నాయని మాయ మాటలు చెబుతున్నారు. అయితే రూ.300 దర్శనం టికెట్‌కు రూ.2 వేలు వసూలు చేస్తున్నారు.
ఇక ప్రతి రోజూ టీటీడీ విడుదల చేసే శ్రీవాణి ట్రస్ట్ టికెట్లకు కూడా భారీగానే కమీషన్ తీసుకుంటున్నారు. రూ.10,500 విలువైన శ్రీవాణి ట్రస్ట్ టికెట్‌కు ఒకరికి రూ.16,500 అంటే.. అక్షరాల 6 వేల రూపాయలు అధికంగా వసూలు చేస్తున్నారు. పైగా గంటలోనే దర్శనం అని.. 5 అడుగుల దూరం నుంచే స్వామిని చూడొచ్చని ఏకంగా గ్రాఫిక్ ఫోటోలు తయారు చేసి సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. ఇక ప్రతి నెలా టీటీడీ విడుదల చేసే దర్శనం, సేవల టికెట్ల విషయంలో దోపిడీకి అంతే లేకుండా పోతుంది. జూన్ నెలలో ఆలయంలో జరిగే సేవలకు 4 రెట్లు డబ్బులు వసూలు చేస్తున్నారు. రూ.1000 ల శ్రీవారి కల్యాణం టికెట్ రూ.5,000 అని ప్రకటించారు. వీటితో పాటు ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకరణ సేవ టికెట్లు కూడా ఉన్నాయని.. వీటికి ఒకరికి అయితే రూ.2,000 చెల్లించాలంటున్నారు. నిజానికి ఈ సేవలకు టీటీడీ నిర్ణయించిన ధర రూ.500 మాత్రమే. కానీ కేటుగాళ్లు నాలుగు రెట్లు అధికంగా వసూలు చేస్తున్నారు. ఉదయం 11 గంటలకు క్యూ లైన్‌లోకి వెళితే..2 నుంచి 3 గంటల్లో బయటకు వచ్చేస్తారని హామీ కూడా ఇస్తున్నారు.
నిజానికి ఇలాంటి మెసేజ్ సోషల్ మీడియాలో రావడం ఇదే మొదటి సారి కాదు. ఇక ప్రతి నెలా విడుదలయ్యే వర్చువల్ సేవా టికెట్లు ఒక్కొక్కరికి రూ.1,400 లు అడుగుతున్నారు. ఇక రూ.1,600ల విలువైన శ్రీనివాస దివ్య హోమం టికెట్.. రూ.14,500 రూపాయలంటూ వాట్సప్ గ్రూప్‌లలో ప్రచారం చేసి.. భక్తులను నిలుపు దోపిడీ చేస్తున్నారు. ఈ అక్రమ దందాపై ఇప్పటికే సోషల్ మీడియా ఎక్స్ ద్వారా నేరుగా టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్ సహా ఇతర అధికారులకు ఫిర్యాదు చేసినా సరే.. ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదు. ఇలాంటి వారి వల్ల ప్రభుత్వానికి, టీటీడీకి కావాల్సినంత చెడ్డ పేరు వస్తుంది. భక్తులు నిలువునా మోసపోతున్నారు కూడా. అయినా సరే టీటీడీ అధికారులు, విజిలెన్స్ విభాగం, ఏపీ ప్రభుత్వం, దేవాదాయ శాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు.