తిరుమల లడ్డుపై బిజెపి దాగుడుమూతలు? ఆప్షన్ జగన్ ఉంచుకుంటున్నారా?
తిరుమల లడ్డుపై అటు కూటమి ఇటు వైసీపీ హోరాహోరీ తలపడుతున్నాయి. వాద ప్రతివాదనలతో హీటెక్కిస్తున్నాయి. ఎవరి వాదన వారిదే అన్నట్లు వ్యవహరిస్తున్నాయి. కాని కూటమిలో భాగమైన బిజెపి మాత్రం ఆచితూచి వ్యవహరిస్తోంది. ప్రెస్ మీట్లు, ప్రెస్ నోట్లు తప్ప ప్రత్యక్ష కార్యాచరణే లేకుండా పోయింది. అసలు ఈ ఇష్యూ మీద అసలు కాషాయధారులు బిజెపి వాళ్లు ఫైట్ చేయకుండా.. ఆ పాత్ర పవన్ కల్యాణ్ పోషించారు. సిట్ రిపోర్టులో కెమికల్ వాడారని వచ్చినా బిజెపి పెద్దగా స్పందించటం లేదు. ఎందుకు?
దీనికి రెండు కారణాలున్నాయంటున్నారు. ఒకటి దీనిపై ఎంత ఎక్కువ చర్చ జరిగితే అంతగా జనంలో తిరుమల పవిత్రతపై విశ్వాసం పోతుందనేది బిజెపి అధిష్టానం ఆలోచనగా చెబుతున్నారు. తాము తిన్న ప్రసాదంలో ఏదో కలిసిందనే భావనే భక్తులు తట్టుకోలేరనేది వారి ఆలోచన అంటున్నారు. అయితే ఆఫ్ ది రికార్డు వినపడుతున్న మాట అయితే దీనిపై గట్టిగా ఫైట్ చేయడం అంటే ఇక భవిస్యత్ లో జగన్ ను కలుపుకోవడం అనేది జరగని పని. అందుకే ఆ ఆప్షన్ పోగొట్టుకోకుండా ఉండాలనే దీనిపై మెత్తగా వ్యవహరిస్తున్నారనేది వినపడుతున్న టాక్.
కౌన్సిల్ లో సోము వీర్రాజులు చేసిన ఘాటు వ్యాఖ్యలు తప్ప బిజెపి పెద్దగా దీనిపై మాట్లాడింది లేదు. ప్రత్యక్ష కార్యాచరణ అంటూ హడావుడి చేశారు గాని అది కూడా వెనక్కు పోయింది. సో జగన్ అనే ఆప్షన్ ఇంకా బిజెపి లిస్టులో ఉందా అందుకే బిజెపి ఇలా చేస్తుందనే చర్చ పెరిగింది.
సిట్ రిపోర్టు వచ్చిన దగ్గర నుంచి వైసీపీ ఎదురుదాడి పెంచింది. కూటమి ఆరోపించినట్లు జంతు కొవ్వు లేదనేదే వారి పాయింట్. అంతేగాని నెయ్యి కాని కెమికల్ వాడారనేదానిపై ఎలాంటి పశ్చాత్తాపం ఆవేదన వారి మాటల్లో లేదు. అసలు నెయ్యే కాదు కాబట్టి కల్తీ జరగలేదని నిస్సిగ్గుగా వాదిస్తున్నారు. మరోవైపు టీడీపీ, జనసేనలు కూడా గట్టి వాదన వినిపించటం లేదు. మధ్యలో హెరిటేజ్ పేరు రావడంతో కాస్త డిఫెన్సులో పడ్డారు. చివరకు క్రిస్టియన్ హిందూ వాదం కూడా తీసుకొచ్చారు. జనంలో మాత్రం తప్పు జరిగిందనే భావన బలంగానే ఉంది. ఇంత రచ్చ నడుస్తుంటే బిజెపి మాత్రం రాజకీయం చూసుకుంటుందా అనే ఆశ్చర్యం అందరిలోనూ కనపడుతోంది.