సినిమా టికెట్ రేట్ల పెంపు.. పవన్ కళ్యాణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Mar 16, 2026 - 15:35
 0  2
సినిమా టికెట్ రేట్ల పెంపు.. పవన్ కళ్యాణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ ఉగాది స్పెషల్ గా మార్చి 19న రిలీజ్ కు రెడీ అవుతుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ లో మాట్లాడిన పవన్ కళ్యాణ్, సినిమా టికెట్ రేట్ల పెంపు గురించి క్లియర్ గా తన అభిప్రాయం చెప్పారు. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, సినిమా అనేది మన దేశంలో చాలా ముఖ్యమైన ఎంటర్టైన్‌మెంట్ అని చెప్పారు. 'ఎంటర్టైన్‌మెంట్ ఈజ్ ద సోల్ ఆఫ్ దిస్ నేషన్. సినిమాను తెలుగు ప్రేక్షకుల నుంచి గానీ, భారతదేశం నుంచి గానీ ఎవరూ దూరం చేయలేరు. సినిమా మన సంస్కృతి, మన జీవన విధానంలో భాగం' అని ఆయన అన్నారు. టికెట్ రేట్లు పెంచడం గురించి చాలా మంది విమర్శలు చేస్తారని, కానీ సినిమా చూడటం ఎవరికి తప్పనిసరి కాదని పవన్ చెప్పారు. అయితే సినిమా చూడాలా వద్దా అనేది ప్రేక్షకుడి ఛాయిస్. ఎవరినీ బలవంతంగా థియేటర్‌కి పంపడం లేదు. ఇప్పుడు ప్రేక్షకులకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. థియేటర్‌కి వెళ్లి చూడొచ్చు, లేదంటే ఓటీటీలో కూడా చూడొచ్చు అని పవన్ అన్నారు. 

అలాగే పెద్ద సినిమాలు తీసేందుకు నిర్మాతలు చాలా డబ్బు ఖర్చు చేస్తారని, అందుకే కొన్నిసార్లు టికెట్ ధరలు కొంచెం పెంచాలని నిర్మాతలు కోరుతారని తెలిపారు. టికెట్ రేట్లు పెంచడం అంటే ప్రేక్షకులను దోపిడీ చేయడం కాదు. పెద్ద సినిమాలు తీసేందుకు ఎంత కష్టం పడతారో నాకు తెలుసు అని పవన్ కళ్యాణ్ అన్నారు. టికెట్ ధరలు పెరగడం వల్ల ప్రభుత్వానికి కూడా ఆదాయం వస్తుందని పవన్ క్లారిటీ ఇచ్చారు. ప్రతి టికెట్‌ పై సుమారు 18 శాతం జీఎస్టీ ప్రభుత్వానికి వెళ్తుందని చెప్పారు. ధరలు పెంచకపోతే కొందరు బ్లాక్‌లో టికెట్లు అమ్మే అవకాశం ఉందని, అప్పుడు ఆ డబ్బు ప్రభుత్వానికి కాకుండా ఇతరుల చేతుల్లోకి వెళ్లిపోతుందని అన్నారు. 

ఇంకా మాట్లాడుతూ, తనకు ఇతర హీరోల విజయాలపై ఎలాంటి అసూయ ఉండదని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. అందరూ బాగుండాలని తాను కోరుకుంటానని చెప్పారు. కాబట్టి ఏ హీరో సినిమా వచ్చినా ఇండస్ట్రీ మొత్తం కలిసి సపోర్ట్ చేయాలని ఆయన అన్నారు. సినిమా ఇండస్ట్రీ ముందుకు వెళ్లాలంటే నిర్మాతలు, హీరోలు, ప్రభుత్వాలు, ప్రేక్షకులు అందరూ కలిసి ఉండాలని పవన్ కళ్యాణ్ అన్నారు. ఆయన చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా తెగ వైరల్ అవుతున్నాయి.