ఆస్కార్స్ వేదికపై కోట శ్రీనివాసరావుకు నివాళి..

Mar 16, 2026 - 16:17
 0  2
ఆస్కార్స్ వేదికపై కోట శ్రీనివాసరావుకు నివాళి..

ప్రపంచ సినీ రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డ్స్ వేడుక ఈసారి కూడా ఎంతో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో హాలీవుడ్‌తో పాటు ప్రపంచంలోని వివిధ దేశాల సినీ ప్రముఖులు పాల్గొన్నారు. అయితే ఈ వేడుకలో ఒక ఎమోషనల్ మూమెంట్ చోటు చేసుకుంది. ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా ఆస్కార్ అకాడమీ ఇన్ మెమోరియం అనే ప్రత్యేక సెగ్మెంట్‌లో గత ఏడాది మరణించిన సినీ ప్రముఖులకు నివాళులు అర్పించింది. 2025లో మరణించిన నటీనటులను, వారి సినీ సేవలను గుర్తు చేసుకుంటూ ప్రత్యేకంగా స్మరించింది. ఈ జాబితాలో హాలీవుడ్ ప్రముఖులతో పాటు భారతీయ సినీ పరిశ్రమకు చెందిన పలువురు దిగ్గజాల పేర్లు కూడా ఉండటం ప్రత్యేకంగా నిలిచింది. ఈ నివాళుల జాబితాలో తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు పేరు కూడా చోటు దక్కింది. అలాగే హిందీ సినీ రంగానికి చెందిన ధర్మేంద్ర, మనోజ్ కుమార్ మరియు ప్రముఖ నటి బి. సరోజా దేవి పేర్లను కూడా ఆస్కార్ అకాడమీ తమ అధికారిక వెబ్‌సైట్‌లో ప్రస్తావించింది. ఈ అద్భుతమైన క్షణం తలుచుకుంటూ భారతీయులు ఎంతో గర్వపడ్డారు. 

ఇక టాలీవుడ్‌ లో విలక్షణ నటుడిగా గుర్తింపు పొందిన కోట శ్రీనివాసరావు సుమారు నాలుగు దశాబ్దాలకు పైగా సినీ ప్రయాణం కొనసాగించారు. ఆయన 2025 జూలై 13న అనారోగ్యం మరియు వయోభారం కారణంగా హైదరాబాద్‌లో కన్నుమూశారు. అప్పటికి ఆయన వయస్సు 83 సంవత్సరాలు. కోట శ్రీనివాసరావు తన సినీ ప్రయాణాన్ని ప్రాణం ఖరీదు సినిమాతో ప్రారంభించారు. ఈ సినిమాలో చిరంజీవి కూడా నటించారు. ఆ తర్వాత 1985లో వచ్చిన ప్రతిఘటన సినిమా ద్వారా ఆయనకు మంచి గుర్తింపు వచ్చింది. ఈ సినిమాతో ఆయన నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. తర్వాత ఆయన వరుసగా ఎన్నో సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నారు. విలన్ పాత్రలు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు, సపోర్టింగ్ రోల్స్ ఇలా వివిధ రకాల పాత్రల్లో ఆయన అద్భుతంగా నటించారు. తన కెరీర్‌లో కోట శ్రీనివాసరావు సుమారు 750కి పైగా సినిమాల్లో నటించారు.