సాగరతీరంలో పేకాట సామ్రాజ్యం.. అధికారుల మౌనం ఎందుకు?

#క్లబ్ #అధికారులు #జూదం

Apr 11, 2026 - 11:28
 0  7
సాగరతీరంలో పేకాట సామ్రాజ్యం.. అధికారుల మౌనం ఎందుకు?

సాగరతీరంలో అదో ఆనందతీరం. మనకు కాదండోయ్... పేకాటరాయుళ్లకు. అవును ఆ క్లబ్‌లోకి వెళితే పేకాట ఎంచక్కా ఆడుకోవచ్చు... టెన్షన్ వచ్చినా ఆనందమొచ్చినా మందు తాగొచ్చు.. అందులోకి స్టఫ్ తీసుకోవచ్చు. ఆకలేసినప్పుడు ఏమైనా తినొచ్చు. ఇక మూడొచ్చినప్పుడు రూములోకి కూడా వెళ్లొచ్చు. ఇన్ని ఫెసిలిటీస్ ఒకే దగ్గర ఉంటే సూపర్ కదా. అవును అందుకే అక్కడికి అందరూ వెళుతుంటారు. ఇన్నాళ్లు మనం పేకాట క్లబ్ అంటే అదొక బ్యాడ్ హ్యాబిట్.. డబ్బులు పొగొట్టుకుంటారు పాపం అమాయకులు అనుకునేవాళ్లం. కాని ఆ అమాయకులకన్నా.. అసలు క్లబ్ వాళ్లే పెద్ద మాయకులు అని.. వాళ్ల సంపాదన అన్ లిమిటెడ్ అని ఈ క్లబ్ వ్యవహారం తెలుసుకుంటేనే అర్ధమవుతుంది. అధికారంలోకి ఎవరొస్తే వారి చేతుల్లోకి వెళ్లిపోతుంది ఇక్కడ బిజినెస్. గతంలో ఒక ఎమ్మెల్యే.. ఇప్పుడు మరో ఎమ్మెల్యే. వాళ్లు డైరెక్టుగా రారు.. వారి బినామీలు వస్తారు అంత చక్కబెట్టుకుంటూ ఉంటారు.  అసలైతే ఇక్కడికి జీఎస్టీవాళ్లు, ఇన్ కమ్ ట్యాక్స్ వాళ్లు, ఈడీ వాళ్లు కూడా రావాలి.. రెయిడ్ చేసి లెక్కలు తీయడానికి. మరి వారికి తెలుసో తెలిసీ తెలియనట్లు ఉంటున్నారో మనకు తెలియదు.
వీళ్లు ఆడిన ఆటకు.. వచ్చిన ఆదాయానికి జీఎస్టీ కట్టాలి. కాని ఆట ఎంత ఆడినా.. డబ్బులెంత వచ్చినా జీఎస్టీ మాత్రం లిమిటెడ్ గా కట్టుకుంటున్నారు.. వాళ్లిష్టం. ఆ అధికారులు కూడా వీళ్లను ఏమీ అనరు... అడగరు. ఎందుకంటే వాళ్లు కూడా వీళ్లకు క్లయింట్సే కదా. ఇక్కడికి వస్తే అన్ని రకాలు దొరుకుతాయి కదా.. అందుకే ఏమీ అనరు. అలా చూపించేది 40 కోట్లు అయితే.. వచ్చేది మాత్రం వంద కోట్లు. అసలు క్లబ్ సొసైటీ కింద రిజిస్టర్ చేశారు. ఆ రూల్స్ ఫాలో అవ్వాలి. అవేవీ ఫాలో అవటం లేదు. ఎందుకంటే రిజిస్ట్రార్ ఆఫీసువాళ్లు కూడా వీళ్ల క్లయింట్సే. 
ఇక పోలీసులంటారా సరేసరి.  ఎటూ ఎమ్మెల్యేగారి దక్షిణ పడుతుందంటారు. పైగా వీళ్లు కూడా క్లయింట్సే ఇక్కడ. అసలు ఆ డిపార్ట్ మెంట్ ఈ డిపార్ట్ మెంట్ అని లేదు. అందరు అధికారుల్లో కొందరు నిజాయితీపరులు, ఏ అలవాటు లేనివాళ్లను మినహాయిస్తే .. మిగతావారంతా ఈ క్లబ్ విజిట్ చేయాల్సిందే. ఎంజాయ్ చేయాల్సిందే. అదీ పరిస్ధితి.  ఒకప్పుడు మెంబర్ షిప్ 5 వేలు .. ఇప్పుడు 5 లక్షలు. ఇలా పెంచడానికి తలా తోకా ఏమీ ఉండదు. వాళ్లిష్టం.. సినిమా టిక్కెట్ల రేట్లలాగా పెంచుకుంటూ పోయారు. 5 లక్షలు కట్టి మరీ ఇక్కడ చేరుతున్నారంటే ఎలాంటోళ్లు వస్తున్నారు.. ఏం చేస్తున్నారో అర్ధం చేసుకోండి.
కొందరు మాత్రం అపరిచితుడు సినిమాలో రామంలాంటి వాళ్లు ఉంటారుగా. వారంతా ఇదేంటి మీరు క్లబ్ రూల్స్ ఫాలో అవరు.. సొసైటీ పద్ధతులు పాటించరు... లెక్కలు లేవు.. వైట్ కన్నా బ్లాక్ ఎక్కువ నడుస్తుంది ... నేను యాక్సెప్ట్ చేయను అని కంప్లయింట్లు పెట్టారు.. కేసులు వేశారు. అయినా ఏమీ అవలేదు. పైగా ఆ రామంలాంటివాళ్లకు బెదిరింపులు వెళుతున్నాయి. చివరకు మాకు ప్రాణరక్షణ కావాలని ప్రెస్ మీట్లు పెట్టుకోవాల్సి వస్తుంది వాళ్లు. 
చట్టం ఇన్ని రకాలుగా ఉల్లంఘించబడుతున్నా మన పెద్దలంతా ఏమీ జరగనట్లు ఏమీ తెలియనట్లు నటిస్తూ ఉంటుంటే ఏమనుకోవాలి? మనిషన్నాక తలనొప్పి రావడం, జ్వరం రావడం సహజం భయ్యా... అలాగే క్లబ్ అన్నాక ఇలాంటి అరాచకాలు జరగడం కామన్ భయ్యా .. లైట్ తీసుకో అంటారా.  అంతేలే ఎవడి ఉపగ్రహం వాడిది.. భూమి మీద ఉన్నందుకు ఎవరి రేంజులో వాళ్లు గుంజాల్సిందేగా అంటారా.  మరేం చేద్దాం. పెద్దలో... డపార్ట్‌మెంట్లో ఈ క్లబ్ కథ వినకపోతారా... చేయి వేయకపోతారా.. లెటజ్ వెయిట్ అండ్ సీ.