వ్యూస్ ఉచ్చులో ప్రొఫెసర్ గారు కూడా...?
ఆహా నుంచి అబ్బో.. ఇప్పుడు అయ్యో అనుకునేదాకా పోయింది వ్యవహారం. యూట్యూబ్ ఎంత పని చేసింది? అవును ఇది యూట్యూబ్ వ్యూస్ ప్రభావమేనా? అంటే రేసులో ముందుంటే బార్గెయినింగ్ పవర్ కూడా పెరుగుతుంది. పాపం వీళ్లు ఏమీ కోరుకోరు కావాలని... రాజకీయ పార్టీ నేతలు ఇలాంటివాళ్లన, సైతం తెలివిగా దారి తప్పిస్తారు. తెలిసి తెలిసి తప్పు చేసేస్తారు. తర్వాత తన ఇమేజ్ ఖరాబు అయిందని అర్ధమయ్యాక తుడిచేసుకోవాలని తెగ ప్రయత్నిస్తారు. ఆ ప్రయత్నంలో మరిన్ని తప్పులు చేస్తారు. ఎంత మేధావి అయినా ఆయనా మనిషే కదా.. అందుకే ఆయన కాసేపు ఆవేశపడినట్లు.. కాసేపు సర్దుకున్నట్లు కనపడుతున్నారు. అసలు ఆయనే కాదు.. చాలా యూట్యూబ్ చానెల్స్ .. మాలాంటి వాళ్లు కూడా ఏ వీడియో వేస్తే బాగా పోతుంది అని ఆలోచిస్తారు. ఏ సబ్జెక్ట్ ప్రజలకు అవసరం.. వాళ్లకు తెలియచేయాల్సింది ఏంటి అనే కాన్సెప్ట్ పోయింది. వ్యూస్ అంతే.. దేనికి వస్తాయో అదే సబ్జెక్ట్. ఆ రేసులోకి సార్ కూడా వెళ్లిపోయి చాలా కాలం అయింది. లేకపోతే ఎన్ సైక్లోపీడియా లాంటి నాగేశ్వర్ గారు కొన్ని పనికిమాలిన విషయాలను కూడా టేకప్ చేయడం ఏంటి అని కొన్నిసార్లు అనిపించింది. పవన్ కల్యాణ్ అన్నట్లు ఈయన దారిన పోయే దానయ్య కాదు.. ఈయన ఏదైనా మాట్లాడితే ఒక అర్ధం ఉంటుంది... దానిలో విషయం ఉంటుందని ఫీలయ్యేవాళ్లు చాలామంది ఉన్నారు. కాని ఆ ఫీలింగ్ గత ఎన్నికల ముందు మొదలై.. అలా మెల్లగా కరిగిపోతోంది. ఈయన కూడా వైసీపీ బ్యాచ్ లో చేరిపోయాడా అని ఎన్నికల ముందు అనిపించింది...
అలా వ్యూస్ ఉచ్చులో చిక్కుకున్న ప్రొఫెసర్ గారు తన రేసు కొనసాగింపులో భాగమే లేటెస్ట్ ఎపిసోడ్ అనుకోవాలి. పవన్ కల్యాణ్ ని, చంద్రబాబును విడదీస్తేనే తనకు భవిష్యత్ ఉంటుందని జగన్ ఫీలవుతున్న విషయం అందరికీ తెలిసిందే. దాని కోసం ఎన్నికల ముందు నుంచి ఇప్పటివరకు రకరకాల ఎత్తుగడలు వేసుకుంటూ వచ్చాడు ఆయన. కాకపోతే ఏదీ సక్సెస్ కాలేదు. దాని కోసం కులం, ప్రాంతం, జిల్లాల పేర్లు దగ్గరినుంచి చాలా అస్త్రాలు ప్రయోగించాడు. ఏవీ వర్కవుట్ అవలేదు. ఇక తనో, తన సాక్షియో.. లేక సాక్షి నెంబర్ 2, 3 చానెల్స్ గాని చెబితే ఎవరూ నమ్మే పరిస్దితి లేదు కాబట్టి.. ఎటూ ప్రొఫెసర్ మనకు కోఆపరేట్ చేస్తున్నాడు కాబట్టి.. ఆయన ద్వారానే డెలివరీ చేస్తే గట్టిగా పేలుతుందని ఈ పని చేశారని అనుకుంటున్నారంతా.
అందుకే ఆయనతో పలికించారని అనుకుంటున్నారు. పవన్ , నాదెండ్ల కలిసి అమిత్ షా ని జగన్ అరెస్ట్ గురించి అడిగారని.. ఆయన అవన్నీ మీకెందుకు... జగన్ లాంగ్ టర్మ్ ఫ్రెండ్ అని క్లాసు తీసుకున్నారని.. ఈ విషయం తనకు జనసేన కోర్ కమిటీలో ఒకరు చెప్పినట్లుగా నాగేశ్వర్ తన స్టయిల్ లో చెప్పుకొచ్చారు.ఇది వైసీపీ స్క్రిప్ట్ అనుకోవడానికి మీకు మరో ఎవిడెన్స్ చెప్పాలి. ఏవైతే యూట్యూబ్ చానెల్స్ పేటీఎంల్లా జగన్ కోసం పని చేసి.. ఇప్పటికీ పని చేస్తున్నాయో అవన్నీ నాగేశ్వర్ డెలివరీ చేసిన వెంటనే మొత్తం అందుకుని తెగ వాయించేశాయి. నాగేశ్వర్ చెప్పారంటే అది క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ అని.. ఆయన చెప్పారంటే ఇక అది అక్షర సత్యం అన్నట్లు బిల్డప్ ఇచ్చేశాయి. ఇక్కడి వరకు అంతా బాగానే నడిచింది.
అయితే జనసేన రివర్స్ ఎటాక్ మొదలెట్టాకే అసలు కథ మొదలైంది. బిజెపికి ఎవరూ శాశ్వత మిత్రులు, శత్రువులు ఉండరు. ఒవైసీని కూడా వాళ్లు వాడేసుకుంటున్నారంటే వాళ్ల తెలివితేటలు ఙంకేం చెప్పాలి. అందుకే వైసీపీ అయినా, టీడీపీ అయినా, జనసేన అయినా కూడా ఎవరిని ఎప్పుడు ఎలా వాడుకోవాలో వారికి బాగా తెలుసు. వాళ్ల రాజకీయం స్ట్రెయిట్ గా ఉండదనే విసయం జనానికి కూడా అర్దమైంది. ప్రత్యామ్నాయం వీక్ గా.. తెలివితక్కువగా ఉన్నంతకాలం నచ్చినా నచ్చకపోయినా.. కొన్ని తేడాలున్నా.. బిజెపియే బెటర్ అనే పొజిసన్ లోకి జనం చాలామంది వెళ్లిపోయారు. కాని వైసీపీ గురించి ప్రత్యేకంగా ఎలివేట్ చేసి... టీడీపీకి, జనసేనకు మధ్య తగాదా పెట్టడానికే అన్నట్లు ప్రొఫెసర్ మాట్లాడారు. ఎన్నో జర్నలిజం క్లాసులు చెప్పిన ఆయన యూట్యూబ్ ఉచ్చులో పడి అవి ఆయనే మర్చిపోయారని అనుకోవాలి. నాదెండ్ల సవాల్ విసరడం, సోషల్ మీడియాలో ఎదురుదాడి మొదలవడంతో ఆయనను ఆవహించిన యూట్యూబ్ చంద్రముఖి వదిలిపోయింది. వెంటనే విరమించుకుంటున్నా అని చెప్పడం.. మళ్లీ ఏదో ఆలోచించుకున్నారో.. ఎవరన్నా చెప్పారో గాని..
మళ్లీ యుద్ధం లాంటి పెద్ద మాటలు మాట్లాడారు. దీంతో పవన్ కల్యాణ్ తన కార్యకర్తల సమావేశంలో గట్టి కౌంటర్ ఇచ్చేశారు. వీటన్నిటి మధ్య అసలు జర్నలిస్ట్ సోర్స్ చెప్పాలా.. అవసరమా లేదా అనే చర్చ కూడా కొందరు పెట్టారు. కచ్చితంగా జర్నలిస్టు సోర్స్ చెప్పాల్సిన అవసరం లేదు. నిజంగా ఆయన నిజమే చెబితే దానికే కట్టుబడి ఉండొచ్చు.. ఏ పరిణామాలు వచ్చినా ఎదురు నిలబడి ఫైట్ చేయొచ్చు. ఆయన అలా ఎందుకు చేయలేకపోయారంటే కారణం.. అది ఎవరో చెబితే పాలో అయి చెప్పినవే కావడం.. తన ఇమేజ్ డ్యామేజ్ అయితే.. రేపు యూట్యూబ్ లో డిమాండ్ పడిపోతే మొదటికే మోసం వస్తుంది కాబట్టి.. వెనక్కి తగ్గారంతే అనుకోవాలి. ఎందుకంటే ఆయన తనకు సబ్ స్క్రైబర్స్ పెరిగారని.. వ్యూస్ పెరిగాయని చెప్పుకోవడంలోనే ఆయన క్రైటిరియా ఏంటో అర్దమైపోతుంది.
ఒకటి మాత్రం వాస్తవం. శత్రువుకు శత్రువు మిత్రుడు అన్నట్లు... తెలంగాణలో ఒక సెక్షన్ ఇప్పటికీ చంద్రబాబును శత్రువుగా చూస్తుంది.. ఎందుకంటే తెలంగాణను అడ్డుకోవడంలో... తెలంగాణ వారిని దోచకోవడంలో ఆయనకు ప్రధాన పాత్ర ఉందనేది వారి గట్టి అభిప్రాయం. అలాంటి చంద్రబాబును ఓడించిన జగన్ ను వారు అభిమానిస్తారు. అదే తెలంగాణను అడ్డుకున్న వైఎస్ కొడుకు జగన్ అనే విషయం మాత్రం కన్వీనియెంట్ గా మర్చిపోతారు. అలాంటి శత్రువు తెలుగుదేశాన్ని గెలిపించిన పవన్ కల్యాణ్ అంటే వారికి మంట. ఆ సెక్షన్ ఇప్పుడు నాగేశ్వర్ కి మద్దతుగా నిలబడింది.. నాగేశ్వర్ సైతం ఆ సెక్షన్ లో ఉన్నారని చెప్పొచ్చు.
ఎవరైనా సరే వ్యూస్ రేసులోకి పోకుండా.. నిజాన్ని నిజంగా నిర్భయంగా చెప్పి.. దాని కోసం ఫైట్ చేస్తే ఓకె.. కాని ఒకరి ప్రయోజనం కోసం మరొకరిని డ్యామేజ్ చేయటం కోసం.. తమ ఇమేజ్ వాడాలనుకోవడం నిస్సందేహంగా తమను తాము తాకట్టు పెట్టుకోవడమే.