పవన్ కమిటీల అసలు అగ్నిపరీక్ష.. పాత జనసైనికులకే ప్రాధాన్యమా?
#ఆంధ్రప్రదేశ్ #పాలిటిక్స్ #pawankalyan #జనసేన
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం జనసేన అధినేత, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చుట్టూనే రాజకీయం నడుస్తోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కాపు నేతలు ఆయన్ను టార్గెట్ చేయడం, జనసేన అంతర్గత వ్యూహాలు, మరియు కాపు సామాజికవర్గంలో జరుగుతున్న చర్చల నేపథ్యంపై ఈ విశ్లేషణ.
పవన్ కళ్యాణ్‌ను వైసీపీ కాపు నేతలు ఎందుకు టార్గెట్ చేస్తున్నారు?
వైసీపీలోని కాపు నాయకులు పవన్ కళ్యాణ్‌ను ప్రధాన లక్ష్యంగా చేసుకోవడానికి బలమైన రాజకీయ కారణాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో జరిగిన విధంగా.. కాపు సామాజికవర్గం ఓట్లు ఏకపక్షంగా ఎక్కడ ఈసారి కూడా పవన్ వైపు వెళ్తాయేమోనని, ఎక్కడ తమ వైఎస్ఆర్సిపి పార్టీకి రాజకీయ భవిష్యత్తు దెబ్బతింటుందేమోనని వైయస్ జగన్మోహన్ రెడ్డి పన్నిన ఒక వ్యూహంలో పావులుగా ఆ పార్టీ నేతలు పవన్ కళ్యాణ్ గట్టిగానే టార్గెట్ చేశారు. పవన్ కళ్యాణ్ కేవలం చంద్రబాబు నాయుడి ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నారని, కాపులను కేవలం ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నారని విమర్శించడం ద్వారా ఆ సామాజికవర్గంలో పవన్ పట్ల ఒక అపనమ్మకం కలిగించడం వారి వారి యొక్క ప్రధాన వ్యూహం. పవన్ ఇమేజ్‌ను తగ్గిస్తేనే, తాము ఆ సామాజికవర్గంలో పట్టు నిలుపుకోగలమని వైసీపీ అధినేత, ఆ పార్టీలో ఉన్నకాపు నేతలు దృఢంగా నమ్ముతున్నారు.
క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం కోసం దృష్టి సారించిన పవన్ కళ్యాణ్..
గతంలో పవన్ కళ్యాణ్ పార్ట్ టైమ్ రాజకీయం చేస్తున్నారనే విమర్శలు ఉండేవి. కానీ, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయన తన శైలిని పూర్తిగా మార్చుకున్నారు. ఒకవైపు ఉపముఖ్యమంత్రిగా ప్రభుత్వ బాధ్యతలు నిర్వహిస్తూనే, జనసేన పార్టీ బలోపేతంపై పవన్ ప్రత్యేక దృష్టి సారించారు. క్షేత్రస్థాయిలో పార్టీ కమిటీల నిర్మాణం, సభ్యత్వ నమోదు కార్యక్రమాలు, మరియు నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. కేవలం ఎన్నికల సమయం లోనే కాకుండా, నిరంతరం ప్రజల్లో ఉండేలా పవన్ పార్టీ యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తున్నారు.
అసలు పవన్ కళ్యాణ్ వ్యూహం ఏంటి?
పవన్ కళ్యాణ్ వ్యూహం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుతానికి కూటమి ధర్మాన్ని పాటిస్తూ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించడం, అదే సమయంలో జనసేనను రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తీగా ఎదిగేలా చేయడం ఆయన ప్రధాన లక్ష్యంగా కనిపిస్తుంది. రానున్న రోజుల్లో సొంతంగా అధికారంలోకి రావడానికి అవసరమైన పునాదికి గట్టిగా ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు అర్థమవుతుంది. అటు సంక్షేమం, ఇటు అభివృద్ధిని సమపాళ్లలో తీసుకెళ్తూన్న, అన్ని వర్గాల ప్రజల్లో ముఖ్యంగా యువత మరియు మహిళల్లో పవన్ ఆశయ సిద్ధాంతాలు, ఆయన కమిట్మెంట్ ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ఆరు పదులు పైబడిన వారు కూడా పవన్ చేపట్టిన పనులు చూసి ప్రశంసలు గుప్పిస్తున్నారు. అక్కడక్కడ పవన్ పై విషయం కక్కుతున్న వారు ఉన్నప్పటికీ, వారిలో కూడా మార్పు తీసుకురావాలని ఆయన ప్రయత్నిస్తున్నారానే చెప్పుకోవచ్చు.
కాపులలో పవన్ కళ్యాణ్ పై పెద్ద చర్చ.!
ప్రస్తుతం కాపు సామాజికవర్గంలో పవన్ కళ్యాణ్ రాజకీయ అడుగులపై తీవ్రమైన చర్చ జరుగుతోంది. ఒక వర్గం ప్రజలు పవన్ కళ్యాణ్ వల్లనే కాపులకు రాజకీయంగా గుర్తింపు, గౌరవం దక్కాయని, ఆయనకు పూర్తి మద్దతు ఇవ్వాలని బలంగా నమ్ముతున్నారు. అయితే, మరో వర్గం మాత్రం పవన్ ఇంకా ఎక్కువ సీట్లు సాధించి, ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి ఉంటే బాగుండేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తోంది. పవన్ తీసుకునే ప్రతి నిర్ణయం ఆ సామాజికవర్గ భవిష్యత్తును ఎలా ప్రభావితం చేస్తుందనే కోణంలో నిరంతర చర్చలు నడుస్తున్నాయి. ఇదిలా ఉండగా.. ఎవరో వైసీపీలో ఉన్న కాపు నేతలు కాపులకు అన్యాయం జరిగింది, నువ్వేమి చేస్తున్నావ్ పవన్ అని ప్రశ్నిస్తే.. పవన్, పదేపదే నన్ను ఒక సామాజిక వర్గానికి అంటగట్టకండి అని అనడం పట్ల, కాపు ఓటర్లుగా ఉన్న వారిలో ఆలోచన మొదలైంది. ఎవరో ఏదో అన్న మాటలకు, పవన్ కాపు సామాజిక వర్గాన్నిమొత్తం దూరం పెడుతున్నట్లుగా రాజకీయాలకు సంబంధం లేని కాపు ఓటర్లు భావిస్తున్నారు. ఎంతసేపటికి పవన్ కళ్యాణ్ ను మేము వోన్ చేసుకోవాలే కానీ పవన్ మమ్మల్ని అంటరానివాళ్లుగా చూస్తున్నారేమో అనే ఆందోళన కాపు సామాజిక వర్గంలో తలెత్తింది.
జనసేన పార్టీని నమ్ముకున్న వాళ్లకు న్యాయం జరుగుతుందా?
జనసేన పార్టీని మొదటి నుంచి నమ్ముకుని, ఎన్నో ఇబ్బందులు పడిన పాత క్యాడర్ మరియు నాయకుల్లో ఈ ప్రశ్న తరచూ వినిపిస్తూ ఉంటుంది. పవన్ కళ్యాణ్ ఈ విషయంలో స్పష్టమైన భరోసా ఇస్తున్నారా అని, ఇప్పుడు నియమించిన కొత్త కమిటీలలో ఉన్న నాయకులు నిష్పక్షపాతంగా వ్యవహరిస్తారా అనే సందేహాలు చాలా మందిలో ఉన్నాయి. పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికీ ప్రాధాన్యత ఉంటుందని ఆయన చెబుతున్నారు. అయితే, కూటమి ప్రభుత్వం కావడంతో పదవుల పంపకాల్లో కొంత ఆలస్యం జరగడం వల్ల కింది స్థాయి నాయకుల్లో కొంత అసహనం ఉంది. కానీ, ఇంకా పూర్తి చేయకుండా అలానే ఉన్న నామినేటెడ్ పదవులు, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పాత వారికి ప్రాధాన్యత దక్కుతుందా లేదా అనే ఆలోచనలు పార్టీ వర్గాల్లో ఉంది.
పార్టీలో ఉన్న నేతల కింద పనిచేసే వారికే పదవులా?
జనసేనలో ప్రస్తుతం ఉన్న సీనియర్ నేతలు లేదా ఇతర పార్టీల నుంచి కొత్తగా వచ్చి చేరిన ముఖ్య నాయకుల వద్ద జీతాలు తీసుకుని పనిచేస్తున్న వారి అనుచరులకే పదవులు దక్కుతున్నాయనే ఒక టాక్ నడుస్తోంది. దీనివల్ల కిందిస్థాయిలో నిజాయితీగా పనిచేసే కార్యకర్తలకు ఎక్కడ అన్యాయం జరుగుతుందనే ఆందోళన చాలామంది జనశ్రేణులలో ఉంది. పెద్ద నేతల సిఫార్సుల వల్లే పదవులు వస్తున్నాయనే భావన ఆ పార్టీ క్యాడర్‌లో నిరాశను నింపుతోంది. ఈ తారతమ్యాలను తొలగించి, నిజమైన గ్రౌండ్ లెవెల్ కార్యకర్తలను గుర్తించి పదవులు ఇవ్వడం పవన్ కళ్యాణ్‌కు ఇప్పుడు పెద్ద సవాలుగా మారింది. మరోపక్క ఈమధ్య పవన్ కళ్యాణ్ స్వయంగా నేనే కమిటీలు అన్నిటిని పర్యవేక్షించి, నా నిర్ణయంతోనే కష్టపడిన వారిని గుర్తించి పదవులు అందించడం జరుగుతుందన్న ఆయన మాటలను మరికొందరు జనశ్రేణులు గట్టిగా నమ్ముతున్నారు. ఏం జరుగుతుందనేది, ఆ పార్టీలో ఉన్న పాత వారికి ఎంతమందికి న్యాయం జరుగుతుందనేది కొంతకాలం వేచి చూడాల్సి ఉంది.