గర్భిణీల ఆరోగ్యంపై అవగాహన.. విజయవంతంగా ‘అను మై బేబీ’ సీఎంఈ

#vijayawada #anumybabyhospital #ఆంధ్రప్రదేశ్ #pregnency

Apr 27, 2026 - 08:57
 0  5
గర్భిణీల ఆరోగ్యంపై అవగాహన.. విజయవంతంగా ‘అను మై బేబీ’ సీఎంఈ

గర్భధారణ సమయంలో తలెత్తే రక్తపోటు సమస్యలపై వైద్యులకు అవగాహన పెంపొందించేందుకు “హైపర్‌టెన్సివ్ డిజార్డర్స్ ఇన్ ప్రెగ్నెన్సీ సిఎంఈ - 2026” పేరుతో నిర్వహించిన శాస్త్రీయ సదస్సు విజయవంతంగా ముగిసింది. నగరంలోని ఫార్చ్యూన్ మురళి పార్క్‌లో ఆదివారం రోజంతా జరిగిన ఈ కార్యక్రమంలో ప్రముఖ గైనకాలజిస్టులు, ఫెటల్ మెడిసిన్ నిపుణులు, క్రిటికల్ కేర్ వైద్యులు పాల్గొని తమ అనుభవాలను పంచుకున్నారు.

ఈ సీఎంఈకి చీఫ్ ప్యాట్రన్ గా వ్యవహరించిన అను గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ ఫౌండర్ చైర్మన్ డాక్టర్ గాజుల రమేష్ మాట్లాడుతూ, గర్భిణీల ఆరోగ్య సంరక్షణలో సమయానికి గుర్తింపు, సరైన చికిత్స అత్యంత కీలకమని తెలిపారు. ఆధునిక విజ్ఞానాన్ని అందిపుచ్చుకుని చికిత్సలందించడం ద్వారా మాతా-శిశు మరణాలను గణనీయంగా తగ్గించవచ్చని అభిప్రాయపడ్డారు. వైద్యుల నిరంతర శిక్షణకు ఇలాంటి సీఎంఈ కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని ఆయన పేర్కొన్నారు. ప్రాథమిక స్థాయిలోనే గర్భిణీల్లో రక్తపోటు సమస్యలను గుర్తించి, సమయానికి సరైన చికిత్స అందించడం ద్వారా తీవ్రమైన పరిస్థితులను నివారించవచ్చని తెలిపారు. ఈ అంశాలపై ప్రజల్లో అవగాహన కలిగించడం అత్యవసరమని డాక్టర్ గాజుల రమేష్ అన్నారు. అను మై బేబీ డైరెక్టర్ డాక్టర్ జి. శ్రీదేవి మాట్లాడుతూ, ఆధునిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకునే వేదికగా ఈ సీఏంఈ ఉపయుక్తంగా ఉంటుందని అన్నారు. సదస్సు విజయవంతానికి కృషి చేసిన నిర్వాహక బృందాన్ని ఆమె అభినందించారు. 

అను మై బేబీ, ఫెర్నాండెజ్ హాస్పిటల్స్ సహకారంతో, విజయవాడ ఆబ్స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ సొసైటీ (వీవోజీఎస్) మద్దతుతో ఈ సదస్సు నిర్వహించబడింది. గర్భిణీల్లో పెరుగుతున్న రక్తపోటు సమస్యలు మాతా-శిశు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్న నేపథ్యంలో, వాటి నిర్ధారణ, చికిత్సలో ఆధునిక విధానాలపై నిపుణులు విశ్లేషణాత్మకంగా చర్చించారు. 

సదస్సులో ప్రిక్లాంప్సియా సమగ్ర అవగాహన, ప్రారంభ దశలో గుర్తింపు, ప్లాసెంటా, డాప్లర్ విశ్లేషణ, గర్భధారణలో ఏపీఎస్ ప్రభావం, ప్రసూతి అనస్థీషియా ఐసీయూ ప్రోటోకాల్స్ వంటి కీలక అంశాలపై ప్రత్యేక సెషన్లు నిర్వహించారు. అలాగే తీవ్రమైన రక్తపోటు పరిస్థితుల్లో తక్షణ వైద్య నిర్ణయాలు, ప్రసవ సమయం ఎంపిక, గ్రామీణ ప్రాంతాల్లో ఎక్లాంప్సియా నిర్వహణ వంటి అంశాలపై నిపుణులు తమ అనుభవాలను పంచుకున్నారు. మధ్యాహ్నం జరిగిన ప్యానెల్ చర్చలు, ప్రాక్టికల్ సెషన్లు వైద్యులకు ఎంతో ఉపయోగకరంగా నిలిచాయి. కార్యక్రమానికి విజయవాడ విజయవాడ ఆబ్స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ సొసైటీ అధ్యక్షురాలు డాక్టర్ పి. హిమా బిందు, కార్యదర్శి డాక్టర్ ఎం. విజయ హాజరై శాస్త్రీయ సమావేశాల ప్రాముఖ్యతను వివరించారు. ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ కవిత బత్తుల సమన్వయంతో కార్యక్రమం సజావుగా సాగింది.  

ఈ కార్యక్రమంలో పలువురు వైద్య నిపుణులు మాట్లాడుతూ, గర్భిణీలలో రక్తపోటు సమస్యలను ముందుగానే గుర్తించి సమర్థవంతంగా చికిత్స చేయడం ద్వారా తల్లి, శిశు ప్రాణాలను రక్షించవచ్చని తెలిపారు. వైద్యుల మధ్య జ్ఞాన వినిమయం, ఆధునిక చికిత్సా విధానాల అవగాహన పెంపు కోసం ఇలాంటి సీఎంఈ కార్యక్రమాలు ఎంతో అవసరమని పేర్కొన్నారు. సదస్సులో పాల్గొన్న వైద్యులకు ఏపీఎంసీ నుంచి రెండు క్రెడిట్ పాయింట్లు అందజేయడం విశేషం. మొత్తం మీద, వైద్య రంగంలో తాజా పరిణామాలను పంచుకునే వేదికగా ఈ సదస్సు నిలిచిందని పాల్గొన్నవారు అభిప్రాయపడ్డారు.