అంబేద్కర్ జీవిత స్ఫూర్తి.. ఫోటో ఎగ్జిబిషన్ ప్రారంభం
#tirupati #B.R.ambedkar #exhibition
భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా తిరుపతిలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఏపీఎస్పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో అంబేద్కర్ జీవిత చరిత్రపై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను సంస్థ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ శివశంకర్ లోతేటి ప్రారంభించారు. జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభమైన ఈ కార్యక్రమం అంబేద్కర్ సేవలను స్మరించుకునే వేదికగా నిలిచింది.
ఈ ఎగ్జిబిషన్‌లో అంబేద్కర్ బాల్యం నుంచి ఆయన విద్యాభ్యాసం, రాజకీయ జీవితం, దళితుల అభ్యున్నతి కోసం చేసిన కృషి, కార్మిక సంస్కరణలు, ఇంధన రంగంలో ఆయన పాత్ర, భారత రాజ్యాంగ రూపకల్పనలో ఆయన విశిష్ట స్థానం వంటి అంశాలను ప్రతిబింబించేలా ప్రత్యేక ఛాయాచిత్రాలను ప్రదర్శించారు. అలాగే ఆయన బౌద్ధమతాన్ని స్వీకరించిన సందర్భం వంటి ముఖ్య ఘట్టాలను కూడా చిత్రరూపంలో అందించారు.
ఈ సందర్భంగా సీఎండీ శివశంకర్ లోతేటి మాట్లాడుతూ, అంబేద్కర్ రూపొందించిన భారత రాజ్యాంగం ప్రపంచానికి ఆదర్శమని పేర్కొన్నారు. సమాజంలో సమానత్వం, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ముఖ్యంగా మహిళలు, కార్మిక వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన కృషి అపారమని చెప్పారు.
విద్యార్థులు ఈ ఎగ్జిబిషన్‌ను సందర్శించి అంబేద్కర్ జీవితం, ఆలోచనలను లోతుగా తెలుసుకోవాలని సూచించారు. రెండు రోజుల పాటు కొనసాగనున్న ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్లు, చీఫ్ జనరల్ మేనేజర్లు, విజిలెన్స్ అధికారులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.