ఏసీబీ రికార్డుల్లో ‘ఏ-1’.. ఆలయంలో మాత్రం ‘నెం-1’!
#Andhrapradesh #ACB #temple #Dwarakatirumala
ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రాల్లో ద్వారకాతిరుమల ఒకటి. “చిన్న తిరుపతి”గా భక్తుల మన్ననలు పొందుతున్న ఈ దేవస్థానం నిత్యం వేలాది మంది భక్తులతో కళకళలాడుతూ ఉంటుంది. భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలిచే ఈ ఆలయంలో ఇప్పుడు అవినీతి ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా ఆలయ పరిపాలనలో కీలక స్థానంలో కొనసాగుతున్న ఓ అధికారి వ్యవహారశైలి ఇప్పుడు దేవాదాయ శాఖలోనే కాకుండా రాజకీయ, భక్త వర్గాల్లోనూ పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తోంది.
ద్వారకాతిరుమల దేవస్థానంలో సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న వాసా నగేష్ పేరు ఇప్పుడు మరోసారి వివాదాల్లో నిలిచింది. గతంలో ఏసీబీ కేసులో పట్టుబడి కోట్ల రూపాయల అక్రమ ఆస్తుల ఆరోపణలు ఎదుర్కొన్న ఆయన.. రిమాండ్‌కు వెళ్లి వచ్చిన తర్వాత కూడా మళ్లీ అదే దేవస్థానంలో ప్రభావం చూపుతుండటం పలు అనుమానాలకు తావిస్తోంది. అధికారికంగా ఆయన బాధ్యతలు పరిమితమైనవే అయినప్పటికీ.. క్షేత్రస్థాయిలో మాత్రం ఆలయంలో జరిగే కీలక వ్యవహారాలన్నీ ఆయన కనుసన్నల్లోనే జరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
పది కోట్ల ఆస్తుల వ్యవహారం
వాసా నగేష్ గతంలో విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో పనిచేసిన సమయంలో ఏసీబీ దృష్టిలో పడ్డారు. అనంతరం నిర్వహించిన దాడుల్లో విజయవాడ, జంగారెడ్డిగూడెం, తాడేపల్లిగూడెం, నిడదవోలు తదితర ప్రాంతాల్లో కోట్ల రూపాయల విలువైన ఆస్తులు బయటపడ్డాయని సమాచారం. సుమారు పది కోట్లకు పైగా అక్రమ ఆస్తులు గుర్తించారనే ప్రచారం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఆ తర్వాత ఆయనను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అయితే కొంతకాలానికే బెయిల్‌పై బయటకు వచ్చిన ఆయన తిరిగి దేవాదాయ శాఖలోనే కీలక బాధ్యతలు నిర్వహించడం ఇప్పుడు విమర్శలకు దారితీస్తోంది.
ప్రసాదాల విభాగం పేరుతో పూర్తి పట్టు?
ప్రస్తుతం నగేష్ అధికారికంగా ప్రసాదాల తయారీ మరియు రిలిజియస్ సెక్షన్ వ్యవహారాలు మాత్రమే చూసుకోవాల్సి ఉన్నప్పటికీ.. ఆలయంలోని కాంట్రాక్టులు, లీజులు, టెండర్లు, ఉద్యోగుల బదిలీలు వంటి అంశాల్లో కూడా ఆయన జోక్యం పెరిగిందని ఆరోపణలు వస్తున్నాయి. ఆలయ షాపుల లీజుల నుంచి సివిల్ కాంట్రాక్టుల వరకు అనేక వ్యవహారాలు ఆయన అనుమతి లేకుండా ముందుకు సాగవని ఉద్యోగులు గుసగుసలాడుతున్నారు.
అర్హతల కంటే ‘అనుకూలత’కే ప్రాధాన్యం ఇస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. కొంతమంది కాంట్రాక్టర్లు, మధ్యవర్తులు ఆయన చుట్టూ తిరుగుతున్నారనే ప్రచారం స్థానికంగా తీవ్ర చర్చకు దారితీసింది.
ఈవో, చైర్మన్ పాత్రపై ప్రశ్నలు
ఆలయ ఈవో, చైర్మన్ ఉన్నప్పటికీ నిర్ణయాధికారం మాత్రం వేరే వ్యక్తి చేతుల్లో ఉందనే విమర్శలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. కీలక ఫైళ్లు, ఆమోదాలు, కాంట్రాక్టుల వ్యవహారాల్లో చివరి మాట నగేష్‌దేనని కొందరు ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయం వరకు తనకు బలమైన పరిచయాలు ఉన్నాయని ఆయన సన్నిహితుల వద్ద చెప్పుకుంటున్నారనే ప్రచారం కూడా కలకలం రేపుతోంది.
ఇది కేవలం ఒక వ్యక్తి ప్రభావమేనా? లేక దేవాదాయ శాఖలో మరింత పెద్ద స్థాయి మద్దతు ఉందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఏఈవో పోస్టుపై కన్ను?
ప్రస్తుతం తనపై నమోదైన ఏసీబీ కేసును బలహీనపరచేందుకు పైస్థాయిలో ప్రయత్నాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కేసు నుంచి బయటపడగానే ఏఈవో (అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్) పదవిపై దృష్టి పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవల అర్చకుల వ్యవహారాలకు సంబంధించిన ఫైళ్లలో కూడా భారీగా డబ్బుల లావాదేవీలు జరిగాయనే ఆరోపణలు వెలుగులోకి రావడం పరిస్థితిని మరింత వివాదాస్పదంగా మార్చింది.
నిబంధనలు ఎక్కడ?
ఏసీబీ కేసుల్లో పట్టుబడిన అధికారులను కీలక బాధ్యతల నుంచి దూరంగా ఉంచాలని ప్రభుత్వ నిబంధనలు చెబుతున్నాయి. అయితే ద్వారకాతిరుమలలో మాత్రం ఆ నిబంధనలు అమలు కాలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. భక్తుల హుండీ కానుకలు, దేవస్థానం ఆస్తులు, కాంట్రాక్టుల వ్యవహారాలు అన్నీ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి ప్రభావంలో ఉండటం ఎంతవరకు సమంజసమని భక్తులు ప్రశ్నిస్తున్నారు.