చిన్నారి హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ శిక్ష-ఎస్పీ ఎస్.వి. మాధవ్ రెడ్డి

Mar 11, 2026 - 10:26
Mar 11, 2026 - 10:29
 0  9
చిన్నారి హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ శిక్ష-ఎస్పీ ఎస్.వి. మాధవ్ రెడ్డి

పార్వతీపురం మన్యం జిల్లాలో మూడు సంవత్సరాల చిన్నారి బాలికను హత్య చేసిన కేసులో నిందితుడికి న్యాయస్థానం యావజ్జీవ కఠిన కారాగార శిక్ష విధించింది. ఈ మేరకు విజయనగరం మొదటి అదనపు జిల్లా జడ్జి ఎం. మీనా దేవి మంగళవారం తీర్పు వెలువరించారు. నిందితుడు కిల్లక వినోద్‌కు జీవిత ఖైదుతో పాటు రూ.11,000 నగదు జరిమానా విధించారు. జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా ఏడు నెలల సాధారణ జైలు శిక్ష అనుభవించాలని కోర్టు ఆదేశించింది.

ఈ విషయాన్ని పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ ఎస్.వి. మాధవ్ రెడ్డి మంగళవారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో వెల్లడించారు. మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.

పోలీసుల వివరాల ప్రకారం గుమ్మలక్ష్మిపురం మండలం పెంగువ గ్రామానికి చెందిన కిల్లక పార్వతి తన మూడు సంవత్సరాల కుమార్తెతో కలిసి 2021 జూన్ 11 రాత్రి ఇంటి వరండాలో నిద్రిస్తుండగా ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. అదే గ్రామానికి చెందిన కిల్లక వినోద్ ఇంటి వరండాలోకి చొరబడి టార్చ్‌లైట్ వెలుగులో పదునైన కత్తితో బాలిక గొంతు కోసి తీవ్రంగా గాయపరిచాడు. చిన్నారి ఏడుపులు విని ఫిర్యాదుదారు మరియు ఆమె తల్లి మేల్కొని కేకలు వేయడంతో నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు.

తీవ్ర గాయాలతో ఉన్న బాలికను ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించినప్పటికీ అప్పటికే ఆమె మృతి చెందినట్లు గుర్తించారు. ఈ ఘటనపై ఫిర్యాదు అందుకున్న ఎల్విన్‌పేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అప్పటి సిఐ తిరుపతి రావు కేసును విచారించి, సాక్ష్యాధారాలను సేకరించి 2021 జూన్ 14న నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపించారు. అనంతరం కేసుకు సంబంధించిన ఛార్జ్ షీట్‌ను సంబంధిత కోర్టులో దాఖలు చేశారు. విజయనగరం మొదటి అదనపు జిల్లా జడ్జి కోర్టులో కేసు విచారణ జరిగింది. విచారణ సమయంలో సాక్షుల వాంగ్మూలాలు, దర్యాప్తు అధికారులు సేకరించిన ఆధారాలను పరిశీలించిన న్యాయస్థానం నిందితుడు చేసిన నేరం నిరూపితమైందని తేల్చింది. దీంతో యావజ్జీవ కారాగార శిక్షతో పాటు జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చింది.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎస్.వి. మాధవ్ రెడ్డి మాట్లాడుతూ మహిళలు, చిన్నారులపై జరిగే నేరాలను పోలీసులు అత్యంత ప్రాధాన్యంగా తీసుకుని దర్యాప్తు వేగంగా పూర్తి చేస్తున్నారని తెలిపారు. బలమైన సాక్ష్యాలతో కోర్టులో కేసులు వాదించడం వల్లే నిందితులకు శిక్షలు పడుతున్నాయని అన్నారు. కేసును సమర్థవంతంగా విచారించి నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన పబ్లిక్ ప్రాసిక్యూటర్లు ఎం. శైలజ, ఎం. ఖజానా రావు, జి. సత్యం, దర్యాప్తు అధికారి తిరుపతి రావు, ప్రస్తుత సిఐ హరి, ఎస్సై శివప్రసాద్, కోర్టు సిబ్బంది రామినాయుడు, పోలిరాజు, పైడిరాజులను జిల్లా ఎస్పీ అభినందించారు.