బీజేపీలోకి ఎంట్రీ కోసం కొడాలి నాని ప్రయత్నాలు..?

#andhrapradesh #politics #BJP #KodaliNani

Apr 29, 2026 - 11:38
Apr 29, 2026 - 15:03
 0  5
బీజేపీలోకి ఎంట్రీ కోసం కొడాలి నాని ప్రయత్నాలు..?

కల్యాణ్ కృష్ణ కుమార్

ఒకప్పుడు ఆయనొక ఫైర్ బ్రాండ్.. ఆఫ్ ఖోర్స్ ఆ ఫైర్ ఆయన కెరీర్ నే తగలబెట్టేసిందనుకోండి. ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే.. సినిమాల్లో పంచ్ డైలాగులకొచ్చే ఫాలోయింగ్ వస్తుందనుకున్నారో ఏమో మరి... చెలరేగిపోయి మాట్లాడారు. తనను జగన్ వాడేసుకుంటున్నారనే స్పృహ అప్పుడు ఉందో లేదో తెలియదు. కాని అది వచ్చేసరికి జరగాల్సిన నష్టమంతా జరిగిపోయింది. మంచి ఫాలోయింగ్ ఉండి.. అసలు ఆయనను గుడివాడలో ఓడించడం అసాధ్యం అని ప్రత్యర్ధులే అనుకున్న పరిస్ధితుల్లో ఘోరంగా పరాజయం పాలయ్యారు. ఎందుకంటే ఆయన యాటిట్యూడ్ మాత్రమే కారణం. దానికి తోడైనా ఆయన లాంగ్వేజ్ కూడా కారణం. కొడాలి నాని అంటే గుడివాడలో ఓ బ్రాండ్. రౌడీ ఇమేజ్ ఉన్నాగాని.. ప్రజలకు అందుబాటులో ఉంటారని.. తనను నమ్ముకున్నవారిని బాగా చూసుకుంటారనే పేరుంది. అందుకే వరుసగా గెలుస్తూ ఏ పార్టీలో ఉన్నా గెలుపు మాత్రం తన ఇంటి పేరు చేసుకున్నారు. కాని ఆయన సామాజికవర్గమే ఆయనకు మైనస్ అయ్యేలా ఆయన ప్రవర్తించిన తీరు చాలామందికి నచ్చలేదు. ఏకంగా చంద్రబాబునాయుడిని, లోకేష్ ని దుర్బాషలాడిన తీరు మాత్రం ఆయన సామాజికవర్గానికే మండిపోయేలా చేసింది. మామూలు జనానికి సరే సరి.
వాడుకున్నంతసేపు వాడుకుని..  డైలాగులు వేసినంతసేపు శెభాష్ అన్న జగన్.. మంత్రివర్గంలోంచి పక్కన పెట్టాడు. అప్పటి నుంచి కాస్త వీక్ అయ్యాడు కొడాలి నాని. ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో ఇంకాస్త వీక్ అయ్యాడు. కొన్నాళ్లు ఆరోగ్య పరిస్ధితులే కారణం గాని.. ఇంకేమన్నా గాని సైలెంట్ అయ్యాడు. తర్వాత బయటికొచ్చి మళ్లీ జగనన్న పేరు జపించాడు. అబ్బో ఇంకా ఏమీ మారలేదు అనుకున్నారు. అయితే ఆయన ఒక కొత్తదారి వెతుక్కుంటున్నట్లు వార్తలొస్తున్నాయి. వైసీపీలో భవిష్యత్ అర్ధం కాకుండా ఉంది. మళ్లీ ఏమన్నా పుంజుకుంటుందా అనుకుంటే జగన్ చేస్తున్న వ్యూహాత్మక తప్పిదాలు అంటే అమరావతిపై నెగటివ్ గా వెళ్లడం లాంటివి... దెబ్బ తీస్తున్నాయి. రాష్ట్రం ఏమో గాని కొడాలి ఏరియాలో మాత్రం కష్టమే. అటు టీడీపీ వైపు చూద్దామా అంటే మనం పారేసుకున్న నోరు వెనక్కి రాదు కదా.. అక్కడ నో ఎంట్రీ. జనసేన అనుకున్నా.. అక్కడికి కూడా రాకుండా పవన్ తో లోకేష్ మాట్లాడే అవకాశముంది.. పైగా ఈయనగారు పవన్ తో కూడా గతంలో సున్నం పెట్టుకున్నాడు. సో మిగితింది బిజెపి. అందుకే బిజెపిలోకి వెళ్లడానికి మార్గం వేసుకుంటున్నట్లుగా ఈ మధ్య అనిపిస్తోంది.


ఆయన మామ ఆర్ఎస్ఎస్ లో చేరడం .. చాలా త్వరగా జిల్లా ప్రముఖ్ కావడం బిజెపి సర్కిల్స్ లోనే ఆశ్చర్యం కలిగించింది. ఇదేదో ప్లాన్ ప్రకారమే జరిగినట్లుగా ఉందని అంటున్నారు. ఏప్రిల్ 19న కొడాలికి చెందిన హాలులోనే జిల్లా ఆర్ఎస్ఎస్ ప్రముఖుల సమావేశం పెట్టారు. కొడాలి నానిపై ఉన్న వ్యతిరేకత కారణంగా బిజెపిలోని కొందరు కూడా ఆయన రాకను వ్యతిరేకిస్తున్నారు. ఈ పరిణామాల పట్ల వాళ్లు కొంచెం ఆందోళన చెందుతున్నారు. ఆర్ఎస్ఎస్ కి ఒక పద్ధతి ఉంటుంది.. ఆ పద్ధతి ఇక్కడ ఏమైనా తప్పారా అనే అనుమానాలు వస్తున్నాయి. అలాగే మహారష్ట్రకు చెందిన ఓ బిజెపి ఎంపీతో కలిసి నాని తిరిగిన ఫోటోలు కూడా బయటకొచ్చాయి. ఇవన్నీ చూస్తే కొడాలి నాని బిజెపిలోకి వెళ్లడం కోసం తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది.