సింగిల్‌గా వచ్చాడు.. కుంభస్థలం కొట్టాడు..!

#Vijaydalapathi #TVKparty #tamilnadu #election #results

May 4, 2026 - 12:18
 0  30
సింగిల్‌గా వచ్చాడు.. కుంభస్థలం కొట్టాడు..!

తమిళనాడులో విజయ్ సరికొత్త చరిత్ర రాశారనే చెప్పాలి. అండర్ డాగ్‌గా చూపించిన వారంతా ఆశ్చర్యపోయేలా ఫలితాలు వెలువడ్డాయి. టీవీకే గెలుస్తుందా అని కొందరంటే.. అసలు విజయ్ గెలుస్తాడా అని మరికొందరు వెటకారంగా వ్యాఖ్యలు చేశారు. అయితే ఇవన్నీ ఇప్పుడు తలకిందులు అయ్యాయి. అధికారంలో ఉన్న పార్టీకి ముచ్చెమటలు పట్టించారు. చివరికి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుని చూపించారు. ఎన్నో ఆరోపణలు.. మరెన్నో విమర్శలు.. అయినా సరే.. అవన్నీ తట్టుకున్నాడు. చివరికి సెంచరీ సీట్లతో చెన్నై సూపర్ కింగ్స్ విజిల్ పోడు అంటూ విజయ్ విజిల్ మోత మోగుతోంది. హంగ్ అనే మాటకు తావే లేకుండా సింగిల్‌గానే సత్తా చాటాడు.

ప్రత్యామ్నాయం సరిగా కనపడితే జనం ఆదరిస్తారని అనేందుకు ఇదే ఉదాహరణ. విజయ్ పై కరూర్ తొక్కిసలాట కేసు, జననాయగన్ సినిమా ఆపేయడం, భార్య విడాకులు, త్రిష.. ఇలా ఒకటి కాదు.. విజయ్‌ను దెబ్బ తీయటానికి అన్ని మార్గాలు ప్రయత్నం చేశారు. అయితే ఇవన్నీ విజయ్ పై సానుభూతి పెంచాయే గాని వ్యతిరేకత తీసుకురాలేదు. ఐదేళ్ల స్టాలిన్ పాలనపై అనుకూలత ఉందా.. అనే అంశం ఇక్కడ ప్రధానం. ఐదేళ్ల స్టాలిన్ ప్రభుత్వంపై ప్రజల్లో కావాల్సినంత వ్యతిరేకత వచ్చింది. ఇందుకు ప్రధానంగా స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు ప్రజల్లో ఆగ్రహం తెప్పించాయి. సనాతన ధర్నం సహా పలు అంశాలపై ఉదయనిధి స్టాలిన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇది ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతకు ప్రధాన కారణం.

అటు ఏఐఏడీఎంకే కూడా ఈ ఎన్నికల్లో డీఎంకేను టార్గెట్ చేసింది. తమ గెలుపు కంటే కూడా స్టాలిన్ సర్కార్‍‌ను ఓడించటమే లక్ష్యం అన్నట్లుగా పావులు కదిపారు ఏఐఏడీఎంకే నేతలు. కేంద్రంలోని బీజేపీతో పొత్తు కుదుర్చుకున్న ఏఐఏడీఎంకే.. తన ప్రచారంలో కూడా గెలుస్తామనే మాట కంటే కూడా.. స్టాలిన్ సర్కార్‌ను ఓడిస్తామనే మాటనే ఎక్కువగా చెప్పింది. స్టాలిన్ సర్కార్ అవినీతి ప్రజలకు వివరించడంలో ఏఐఏడీఎంకే నేతలు సక్సెస్ అయ్యారనే చెప్పాలి. అయితే సొంతంగా పోటీ చేస్తే ఓడిపోతామనే భయంతోనే ఒక దశలో విజయ్‌తో పొత్తు కోసం బీజేపీ అగ్రనేతలు తీవ్రంగా ప్రయత్నించారు కూడా. విజయ్ లొంగకపోవడంతో.. సీబీఐ కేసులు, ఈడీ దాడులు.. అంటూ విజయ్‌ను టార్గెట్ చేశారు. అయితే ఇవన్నీ విజయ్‌పై సానుభూతికి కారణమయ్యాయి. 

ఇక టికెట్ల కేటాయింపులో విజయ్ అనుసరించిన వ్యూహం ప్రత్యర్థులకు షాక్‌తో పాటు ప్రజల్లో కూడా టీవీకేకు అనుకూలంగా మారింది. టికెట్లను ప్రకటించిన విజయ్.. తన డ్రైవర్ కొడుకు శభరినాథన్‌ను విరుగంబాక్కం నుంచి పోటీలో నిలబెడుతున్నట్లు ప్రకటించారు. ఇది అక్కడ ఉన్నవారితో పాటు తమిళనాడు మొత్తాన్ని ఆశ్చర్యానికి గురి చేసింది. తమిళ రాజకీయాల్లో ఇలా ఇప్పటి వరకు ఒక్కసారి కూడా జరగలేదు. ప్రస్తుతం డబ్బు, పలుకుబడి ఉన్నవాళ్లు మాత్రమే రాజకీయాల్లో రాణించలేకపోతున్నారు. అలాంటిది ఒక డ్రైవర్ కొడుకును నిలబెట్టి విజయ్ పెద్ద సాహసమే చేశాడు. సింగిల్‌గా పోటీ చేసి, అటు జాతీయ పార్టీలతో కానీ, ఇటు ప్రాంతీయ పార్టీలతో కానీ పొత్తు గానీ, లోపాయికారీ ఒప్పందం చేసుకోకుండా ప్రతి నియోజకవర్గంలో కూడా "విజయ్ మాత్రమే నిలబడుతున్నాడు.. మీరు అభ్యర్థిని చూడకుండా విజయ్‌ను చూసి ఓటు వేయండి” అంటూ పిలుపునిచ్చాడు. ఇవే తమిళ జనాల్ని బాగా ఆకట్టుకున్న అంశాలు.