రాయనపాడు రైల్వే గేట్ వద్ద ట్రాఫిక్.. ఫ్లైఓవర్ ఎప్పుడు?
#Andhrapradesh #rayanapadu #railway #Public
చల్లా రవీంద్ర బాబు
రాయనపాడు రైల్వే గేట్ వద్ద నిత్యం ట్రాఫిక్ నరకం..
గంటల తరబడి రోడ్డుపైనే ప్రజల జీవితం..
అంబులెన్స్‌లు ఆగిపోతే… విద్యార్థులు ఆలస్యమైతే… బాధ్యత ఎవరిది..?
విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గ పరిధిలోని విజయవాడ రూరల్ మండలం రాయనపాడు రైల్వే గేట్ ఇప్పుడు వేలాది మంది ప్రజలకు నిత్య సమస్యగా మారింది. రోజురోజుకూ పెరుగుతున్న రైల్వే రాకపోకలు, భారీ వాహనాల రద్దీతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఇప్పటికే నాలుగు రైల్వే లైన్ల పనులు పూర్తయ్యాయి. లూప్ లైన్ పనులు కూడా చివరి దశకు చేరుకోవడంతో రైల్వే గేట్ వద్ద ట్రాఫిక్ మరింత పెరిగింది. గేట్ మూసిన ప్రతిసారి కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోతుండటంతో ప్రజలు గంటల తరబడి రోడ్డుపైనే వేచిచూడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.
రాయనపాడు, పైడూరుపాడు, కవులూరు, వెలగలేరు తదితర గ్రామాల ప్రజలు ప్రతిరోజూ ఇదే మార్గాన్ని వినియోగిస్తున్నారు. విద్యార్థులు పాఠశాలలు, కళాశాలలకు ఆలస్యంగా చేరుకుంటున్నారు. ఉద్యోగులు కార్యాలయాలకు సమయానికి వెళ్లలేక ఇబ్బందులు పడుతున్నారు. కార్మికులు పనివేళలు కోల్పోతున్నారు. రైతులు, వ్యాపారులు రవాణాలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
అత్యవసర పరిస్థితుల్లో పరిస్థితి మరింత దారుణంగా మారుతోంది. ట్రాఫిక్‌లో అంబులెన్స్‌లు కూడా నిలిచిపోతుండటంతో రోగులను ఆసుపత్రులకు తరలించడం కష్టమవుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెబుతున్నారు.
ఇప్పటికే గేట్ దిశలో మార్పులు చేసినప్పటికీ సమస్యకు పరిష్కారం కనిపించలేదని ప్రజలు అంటున్నారు. ట్రాఫిక్ నియంత్రణలో తాత్కాలిక చర్యలకే పరిమితమవుతున్నారే తప్ప శాశ్వత పరిష్కారంపై ఎలాంటి స్పష్టత లేదని ఆరోపిస్తున్నారు.
ప్రజల్లో ఇప్పుడు ఒక్కటే ప్రశ్న
“ఫ్లైఓవర్ ఉందా… లేదా..?”
ఏళ్లుగా హామీలు వినిపిస్తున్నా పనులు ఎప్పుడు ప్రారంభమవుతాయి..? అసలు ప్రతిపాదన ఏ దశలో ఉంది..? పెరుగుతున్న ట్రాఫిక్‌కు ప్రభుత్వం వద్ద పరిష్కారం ఏమిటి..? అనే ప్రశ్నలు ప్రజల్లో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి.
ప్రజలు రాజకీయాలు కాదు… స్పష్టమైన సమాధానం కోరుతున్నారు. అభివృద్ధి పేరుతో పనులు పూర్తవుతున్నా ప్రజల ఇబ్బందులకు మాత్రం ముగింపు కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రజలు అడుగుతున్న ప్రశ్నలు ఇవే…
ట్రాఫిక్ నరకానికి ముగింపు ఎప్పుడు..?
అంబులెన్స్‌లు ఆగిపోతే బాధ్యత ఎవరిది..?
ఫ్లైఓవర్‌పై స్పష్టత ఎందుకు లేదు..?
ప్రజలు ఇంకా ఎన్నేళ్లు ఇబ్బందులు పడాలి..?
ప్రస్తుతం ప్రజాసంఘాలు, స్థానికులు సమస్య పరిష్కారం కోసం గళమెత్తుతున్నారు. ప్రజల ఇబ్బందులను గుర్తించి ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు.