రాజకీయ హీరో.. మళ్లీ సినిమా హీరోగా  నటిస్తే.. ?

#PawanKalyan #NTR #AndhraPolitics #Tollywood #PoliticalJourney #FilmToPolitics #APPolitics #Leadership #IndianPolitics #CinemaAndPolitics

Apr 1, 2026 - 17:13
 0  10
రాజకీయ హీరో.. మళ్లీ సినిమా హీరోగా  నటిస్తే.. ?

సినిమా హీరోను, రాజకీయ హీరోగా గుర్తించిన తర్వాత.. మళ్లీ సినిమా హీరోగా చూసేందుకు మెజారిటీ ప్రజలు ఇష్టపడతారా..? గతంలో దివంగత నందమూరి తారక రామారావుకు ఈ విషయం అనుభవంతో కానీ తెలిసి రాలేదు. 1983, 1985ల్లో జరిగిన ఎన్నికల్లో అధికారం కైవసం చేసుకున్న ఎన్టీఆర్‌ను కారణాలు ఏమైనప్పటికి 1989 ఎన్నికల్లో మెజారిటీ ప్రజలే ఓడించారు. సీఎంగా బిజీగా కాలం గడిపిన ఎన్టీఆర్‌.. అధికారం కోల్పోయిన తర్వాత ఎక్కువగా ఖాళీగా ఉండాల్సి వచ్చింది. అలా ఖాళీగా ఉండటం ఎందుకు అని.. మూడు సినిమాలను సొంతంగా తీశారు. ఆ మూడు సినిమాలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. అప్పట్లో తన సినిమాలు ఫ్లాప్ కావడంపై కొందరితో ఎన్టీఆర్ మాట్లాడుతూ.. తనను రాజకీయ హీరోగా మెజారిటీ ప్రజలు గుర్తించారే తప్పా.. మళ్లీ సినిమా హీరోగా గురించ లేదన్నారు.

ఒకసారి సినీ టాప్ హీరోను గుర్తించిన ప్రజలే, రాజకీయ హీరోగా గుర్తించి అధికారం కట్టబెట్టాక.. మళ్లీ ఆయనను సినిమా హీరోగా గుర్తించరని ఎన్టీఆర్ విషయంలో స్పష్టమైంది. అయినా కూడా ఆ విషయం తెలుసుకోకుండా ప్రస్తుత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తప్పటడుగు వేస్తున్నారనే మాట ప్రస్తుతం సినీ వర్గాల్లో బాగా వినిపిస్తోంది. తన సినిమాలు ఎందుకు ఫ్లాప్ అవుతున్నాయో ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ గుర్తించ కలిగితే.. మళ్లీ  సినిమాల్లో నటించకుండా.. పూర్తిగా రాజకీయాలకే పరిమితం అయితే.. ఆయనకు రాజకీయంగా ఎదురుండదు. సినిమా హీరో కన్నా రాజకీయ నాయకుడిగానే మెజారిటీ ప్రజలు పవన్‌ను గుర్తించారు.. గుర్తిస్తున్నారు. ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోవటానికి.. చంద్రబాబు, లోకేష్ కన్నా పవన్ కళ్యాణ్ ముఖ్య కారణమని వైసీపీ నేతలకు కూడా తెలుసు. జగన్ రెడ్డిని తీవ్రంగా వ్యతిరేకించే వారందరూ పవన్ వెంటే ఉన్నారని అంతా నమ్ముతున్నారు.

ముఖ్యంగా టీడీపీ కార్యకర్తలు, ఆ పార్టీ సానుభూతి పరులే పవన్ కళ్యాణ్‌ను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. జగన్ రెడ్డిని, రాజకీయంగా మట్టి కరిపించగల నేతగా పవన్ కళ్యాణ్‌కు గుర్తింపు వచ్చింది. అలాంటి రాజకీయ నేతగా పేరు తెచ్చుకున్న పవన్ కళ్యాణ్.. ఇక సినిమాలకు స్వస్తి చెబితే బాగుంటుంది. ముఖ్యంగా దివంగత ఎన్టీఆర్‌కు ఎదురైన చేదు అనుభవాలను పవన్ కళ్యాణ్ దృష్టిలో పెట్టుకోగలిగితే.. ఇప్పటికే రాజకీయ హీరోగా గుర్తించిన, మెజారిటీ ప్రజలే, ఆయనకు రాజకీయంగా రెట్టింపు అండగా ఉండి.. పవన్‌ను ఎన్టీఆర్ స్థాయికి తీసుకెళ్లటం ఖాయం. ఒక సినీ హీరోను, రాజకీయ హీరోగా  ప్రజలు గుర్తించాక, మళ్లీ  హీరోగా సినిమాల్లో నటించినా, మెజారిటీ ప్రజలు ఆధరించరని, ఎన్టీఆర్ కు ఎదురైన  అనుభవాలు పవన్ కళ్యాణ్ కు రాకుండా ఉండాలంటే.. మళ్లీ సినిమాల జోలికి ఆయన వెళ్లకూడదు.

కొసమెరుపు ఏమిటంటే.. ఎన్టీఆర్ ను నిజాయతీ పరుడైన రాజకీయ నాయకుడిగా మెజారిటీ ప్రజలు గుర్తించారు.. గుర్తుంచుకున్నారు కూడా. డిప్యూటీ సీఎం అయ్యాక పవన్ కళ్యాణ్ ను కూడా నిజాయతీ పరుడైన నాయకుడుగా మెజారిటీ ప్రజలు.. చివరకు జగన్ రెడ్డి అభిమానులు కూడా ఆఫ్ ది రికార్డుగా పవన్‌కు అనుకూలంగా కామెంట్లు చేస్తున్నారు. మేమే 15 ఏళ్లు అధికారంలో ఉంటాం.. చంద్రబాబు నాయకత్వంలో ముందుకు పోతాం.. మళ్లీ జగన్ రెడ్డిని అధికారంలోకి రానివ్వం అని పవన్ కళ్యాణ్ పదే పదే నొక్కి చెబుతున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ కార్యకర్తలు, ఆ పార్టీ సానుభూతి పరులు కూడా, ఆయనకు అభిమానులు అవుతున్నారు. అధికారంతో పవన్ కళ్యాణ్ నిజాయతీ రెట్టింపు అయ్యిందని, ఒక మంత్రి ఎలా ఉండాలో, ఆచరణలో పవన్ కళ్యాణ్ చూపారు. ఆయన నిర్వహిస్తున్న పంచాయతీ, గ్రామీణాభివృద్ధి శాఖల్లో పనిచేస్తున్న మెజారిటీ అధికారులు, ఉద్యోగులే పవన్ కళ్యాణ్ కు చేతులెత్తి దండాలు పెడుతున్నారు.