"ఇడుపు కాయితం"పై ఇంత రచ్చ ఎందుకు..?

#entertainment #ఇడుపు కాయితం #సినిమాలు #తెలంగాణ #andhrapradesh #priyadarsi #కాంట్రవర్సీ

Jun 30, 2026 - 11:06
 0  4
"ఇడుపు కాయితం"పై ఇంత రచ్చ ఎందుకు..?

ఇడుపు కాయితం.. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. ఇంకా చెప్పాలంటే.. నిన్నటి వరకు లేని ప్రాంతీయ, భాష, యాసను ఎత్తిచూపిస్తున్న ఓ ఆరు అక్షరాల మాట. ఇడుపు కాయితం.. అంటే ఏదో కొత్త పదం కాదు. పెండ్లి అయినంక భార్యాభర్తలు కలిసి ఉండలేమంటే, నలుగురు పెద్దలు కూసోని మాట్లాడి, సర్ది చెప్పి, ఇంకా కుదరకపోతే ఇద్దరి అంగీకారంతో రాసుకునే కాయితమే ఈ “ఇడుపు కాయితం”. కోర్టులు, లాయర్లు అందుబాటులో లేని కాలంలో తెలంగాణ పల్లెల్లో పెద్దల సమక్షంలో జరిగిన సామాజిక పరిష్కారం. తెలంగాణ బతుకులు, తెలంగాణ ఆచారాలు తెలియనోళ్లకు ఇడుపు కాగితం కూడా విచిత్రంగానే కనిపిస్తుంది.

భాష అనేది కేవలం సంభాషణకు సాధనం మాత్రమే కాదు. అది ఒక ప్రాంత చరిత్ర, సంస్కృతి, జీవన విధానం, భావోద్వేగాలకు ప్రతిబింబం. అలాంటి భాషను, యాసను హేళన చేయడం అంటే ఆ ప్రాంత ప్రజల ఆత్మ గౌరవాన్ని అవమానించడమే. తెలంగాణ యాసపై దశాబ్దాలుగా సాగిన వివక్ష కొత్తది కాదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలంలో సినిమాలు, టెలివిజన్, వేదికలు, రాజకీయ ప్రసంగాల్లో తెలంగాణ యాసను తరచూ హాస్యానికి,విలనిజానికి, అజ్ఞానానికి ప్రతీకగా చూపించారు. ఫలితంగా తెలంగాణ ప్రజల్లో తమ యాస పట్ల ఒక రకమైన న్యూనతాభావాన్ని కలిగించే ప్రయత్నాలు జరిగాయి. అయితే, ఎన్నో త్యాగాల తర్వాత తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించింది. స్వయం పాలన వచ్చింది. కానీ తెలంగాణ యాస, భాషపై అప్పుడప్పుడూ అవహేళనలు వినిపించడం బాధాకరం. 

తాజాగా "ఇడుపు కాయితం" అనే తెలంగాణలో వాడుకలో ఉన్న పదంపై చేసిన విమర్శ లు కూడా అదే మనస్తత్వానికి నిదర్శనం. "కాకిపిల్ల కాకికి ముద్దు" అన్నట్లుగా ఎవరి భాష వారికి అందం. ఆనందం. భారతదేశంలో వందలాది భాషలు, వేలాది మాండలికాలు ఉన్నాయి. లిపి లేని భాషలు కూడా ఉన్నాయి. అయినా వాటిని మాట్లాడే ప్రజలు గర్వంగా తమ భాషను కాపాడుకుంటున్నారు. మరి ఒక రాష్ట్ర అధికార భాషలో భాగమైన తెలంగాణ యాసను ఎగతాళి చేయడం ఏ సంస్కృతికి నిదర్శనం.? భాషలను తక్కువగా చూడటం సరికాదు. ప్రతి ప్రాంతానికీ తనదైన పదజాలం, ఉచ్చా రణ, భావవ్యక్తీకరణ ఉంటాయి. వాటిని గౌరవించడం భారత రాజ్యాంగం సూచించే వైవిధ్యంలో ఏకత్వం అనే స్ఫూర్తికి అనుగుణం. 

ఆంధ్రప్రదేశ్‌తో పరిపాలనా విభజన జరిగినా, కొందరు మాత్రం ఇప్పటికీ ఆంధ్ర, తెలంగాణ అంటూ ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ప్రధానంగా తెలంగాణలో ఉంటున్న ఆంధ్రోళ్లు అంటూ కొందరు రాజకీయ నేతలు చేస్తున్న రెచ్చగొట్టే వ్యాఖ్యలు రెండు రాష్ట్రాల ప్రజల మధ్య మళ్లీ చిచ్చు పెడుతున్నాయి. నిజానికి తెలంగాణ పట్ల ప్రస్తుతం ఎవరికీ చిన్నచూపు లేదు. కానీ.. కొందరు మాత్రం.. పనిగట్టుకుని మరీ ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. విమర్శలు చేయవచ్చు, భిన్నాభిప్రాయాలు ఉండవచ్చు. కానీ ఒక ప్రాంత భాషను కించపరచడం మాత్రం ప్రజల మనోభావాలను దెబ్బతీస్తుంది.

"ఇడుపు కాయితం".. ఈ పేరులో అచ్చమైన తెలంగాణ యాస, మాండలికం ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ప్రాంతానికీ ఓ యాస ఉంది. ఉత్తరాంధ్ర యాస వేరు. గోదావరి జిల్లాల యాస వేరు. కోస్తాంధ్ర యాస వేరు. రాయలసీమ యాస వేరు. అలాగే తెలంగాణ తెలుగుకు కూడా తనదైన ప్రత్యేక శైలి ఉంది. గతంలో రాయలసీమ యాసలో ఎన్నో సినిమాలు వచ్చాయి. ఇటీవల వచ్చిన పలాస, పెద్ది లాంటి సినిమాలు ఉత్తరాంధ్ర యాసలో ఉన్నాయి. గోదావరి యాసలో రంగస్థలం, చిత్తూరు యాసలో పుష్ప వచ్చాయి. తెలంగాణ యాసలో వచ్చిన సినిమాలకు లెక్కే లేదు. అంతమాత్రాన అది తెలుగు కాకుండా పోతుందా..? దానికి సబ్ టైటిల్స్, డబ్బింగ్ అనే మాటలు ఇప్పుడు ఎందుకు అంటున్నారో అర్థం కావటం లేదు. 

ప్రస్తుతం పరభాషా సినిమాలు ఎన్నో అదే పేరుతో తెలుగులో విడుదలవుతున్నాయి. కంగువ, ఆయలాన్, ఆరమ్ వెట్రుమై, ధురంధర్.. లాంటి సినిమాలపై లేని అభ్యంతరం "ఇడుపు కాయితం" సినిమా విషయంలో మాత్రమే ఎందుకు..?. ఇక్కడ మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. ఆ సినిమా తీస్తున్న నిర్మాతలు ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారు. నటిస్తోంది, దర్శకత్వం చేస్తోంది తెలంగాణ ప్రాంత వాసులు. వాళ్లకు ఎక్కడా ఆంధ్రా - తెలంగాణ అనే ఇబ్బంది మాత్రం లేదు. కానీ పనిగట్టుకుని ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టాలనుకునే కొంతమంది ఇలాంటి పనులు చేస్తుంటారనే మాట మాత్రం వాస్తవం. ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టాలనుకునే వారికి ఒకటే సలహా.. వెళ్లి ముందు యాస, భాష, మాండలికాల గురించి కాస్త చదువుకోవాలి. తర్వాత సినిమా చూడాలో వద్దో ఆలోచించుకోవాలి. 

తెలంగాణ యాసలో మాట్లాడటం వెనుకబాటుతనం కాదు, అది తెలంగాణ గుర్తింపు. ఆ యాసలో పాడిన పాటలు, రాసిన సాహిత్యం, చెప్పిన కథలు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందుతున్నాయి. కాబట్టి తెలంగాణ భాషను అవహేళన చేయడం మానేసి, ప్రతి ప్రాంత భాషను గౌరవించే సంస్కృతి పెంపొందించుకోవాలి. భాషను కాదు, భావాన్ని గౌరవించాలి. యాసను కాదు, మనిషిని గౌరవించాలి. అదే నిజమైన ప్రజాస్వామ్యం, అదే భారతీయ సంస్కృతి.