ఇంకా ''ఎంత'' కాలం ఈ గుత్తాధిపత్యం
#vijayawada #kanakadurgatemple #andhrapradesh
కుమార్ చంద్ పుల్లగూర
ఇటీవలి కాలంలో దుర్గగుడిలో రోజుకొక అవకతవకలు బయటపడుతున్నాయి. అమ్మవారి గుడి అంటేనే ఒక ఆధ్యాత్మిక ప్రాంతం అన్న ధోరణి పోయి.. ఓ వ్యాపార వాణిజ్య కేంద్రంలా మారిపోతోంది. అమ్మవారి గుడిని ఆసరాగా చేసుకుని ఎందరో దళారులు రాజ్యమేలుతున్నారు. అంతేకాకుండా అమ్మవారి సన్నిధిలో.. కొలువునే ఏర్పాటు చేసుకుంటున్నారు కొందరు బడా వ్యాపారవేత్తలు. అందుకు ఉదాహరణే.. అమ్మవారి లడ్డూ కౌంటర్.. ఈ కౌంటర్ గత రెండు దశాబ్దాలుగా ఒకే వ్యక్తి పరమవటం కాస్త అనుమానాలకు తావిస్తోందనటంలో ఎటువంటి సందేహం లేదు. అస్సలు అమ్మవారి గుడిలో లడ్డూ కౌంటర్‌ను ఎవరు సొంతం చేసుకుంటున్నారు.. ఏ నియమనిబంధనల ఆధారంగా ఆ కాంట్రాక్టు లభిస్తోంది ఏంటి అన్న విషయాలను పాయింట్ స్పెషల్ ఫోకస్ స్టోరీలో చూద్దాం.
ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న కనకదుర్గమ్మ గుడికి రోజూ వేలాది మంది భక్తులు తరలివస్తుంటారు. తరలి వచ్చిన భక్తులు అమ్మవారి ప్రసాదాన్ని ఎంతో భక్తివిశ్వాసాలతో అమ్మ దర్శనం అయిన వెంటనే ఆ ప్రసాదాన్ని తీసుకుని వెళుతుంటారు. అంటే అమ్మవారి దేవస్థానానికి లడ్డూ ప్రసాదం ఓ ప్రధానమైన ఆదాయ వనరు. లడ్డూతో పాటుగా పులిహోర ప్రసాదం కూడా ఎల్లప్పుడూ అమ్మవారి దేవస్థానంలో ఉంటుంది. భక్తులు ఈ రెండు ప్రసాదాలను కొనుగోలు చేసి తమ వెంట తీసుకుని వెళతారు. అయితే ఇందులో చిన్న విషయమేంటంటే.. లడ్డూ ప్రసాదం కొన్ని రోజులు నిల్వ ఉండే ప్రసాదం కాబట్టి భక్తులు ఎక్కువగా ఈ ప్రసాదానికి ప్రాధాన్యం ఇస్తుంటారు. ఈ నేపధ్యంలోనే ఈ లడ్డూ ప్రసాదానికి ఓ ప్రత్యేకత ఏర్పడింది. అందుకే ఈ లడ్డూ కాంట్రాక్టును సొంతం చేసుకోవాలంటే అంతా ఆషామాషీ కాదు అన్న విషయం స్వయంగా ప్రస్తుతం లడ్డూ కాంట్రాక్టును కొనసాగిస్తున్న కాంట్రాక్టరే స్వయంగా చెబుతాడు కూడా.
ఇదిలా ఉంటే.. ఈ లడ్డూ కాంట్రాక్టును గత రెండు దశాబద్దాలుగా విశ్వేశ్వరరావు అనే వ్యక్తే సొంతం చేసుకోవటంపై పలు విమర్శలు వినిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే.. కనకదుర్గమ్మ గుడి ప్రస్తుతం దేవాదాయ ధర్మాదాయ శాఖ కింద ఉన్న దేవస్థానంగా ఉండగా.. ఈ దేవస్థానానికి సంబంధించిన ప్రతి కాంట్రాక్టును పారదర్శకంగా నిర్వహించాల్సి ఉంటుంది. అంటే ప్రతి కాంట్రాక్టును టెండర్ విధానం ద్వారా పారదర్శకంగా నిర్వహించాలి. అదేవిధంగా ప్రకటన ఇచ్చిన అనంతరం ఔత్సాహిక కాంట్రాక్టర్లు ఎవరైతే తక్కువ ధరకు కోడ్ చేస్తారో వారికి అవకాశం కల్పించాల్సి ఉంటుంది. అదేవిధంగా తక్కువ ధరకు కోడ్ చేసినా.. నాణ్యతా ప్రమాణాలు లేని సందర్భంలో ఆ కాంట్రాక్టును రద్దు చేసే హక్కు దేవస్ధానానికి కూడా ఉంటుంది. కానీ ఈ నియమ నిబంధనలన్నింటినీ తుంగలో తొక్కి సదరు లడ్డూ కాంట్రాక్టును టెండర్ విధానంలో కాకుండా తమకు నచ్చిన పద్ధతిలో ఒకే వ్యక్తికి అప్పచెబుతుండటం ప్రస్తుతం విమర్శలకు తావిస్తోంది. పైగా టెండర్ విధానాన్ని నిర్వహించిన సమయంలో ఎల్-1 కాంట్రాక్టరు అయితేనే కాంట్రాక్టును అందించాలి. కానీ ఆ పద్ధతిలో కాకుండా కేవలం సుదీర్ఘమైన అనుభవం ఉందన్న నెపంతో దేవాదాయ శాఖ అధికారులు, ఇటు దుర్గగుడి ఉన్నతాధికారులు ఒకే వ్యక్తికి ఏళ్ళ తరబడి కాంట్రాక్టును కట్టబెట్టటంపై పలు అనుమానాలు లేకపోలేదు.
అయితే సదరు కాంట్రాక్టరు మాత్రం ఎంతో ధీమాగా తనకున్న సుదీర్ఘమైన అనుభవమే తనకు కాంట్రాక్టు పరమవటానికి కారణమని, ఇందులో దుర్గగుడి ఈవోకి కూడా సంబంధం ఉండదని చెబుతున్న పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. అయితే దుర్గగుడి లడ్డూ కాంట్రాక్టును టెండర్ ప్రక్రియ ద్వారా నిర్వహిస్తే మరికొందరు ఔత్సాహిక కాంట్రాక్టర్లు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కానీ ఇవేమీ పట్టనట్లు తమకు నచ్చిన విధంగా కాంట్రాక్టులను కట్టబెట్టటం వెనుక ఆంతర్యమేంటో దుర్గగుడి ఉన్నతాధికారులే చెప్పాలి. ఇక నిజానిజాలేంటో దేవాదాయధర్మాదాయశాఖ ఉన్నతాధికారులే నిగ్గుతేల్చాలని పలువురు కోరుతున్నారు.