రాత్రి వేళల్లో నిబంధనలు అతిక్రమిస్తున్న హోటల్?
#vijayawada #andhrapradesh #ఇబ్రహీంపట్నం #hotel #rules
ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో కొత్త గేటు సమీపంలో ఉన్న మలబార్ హోటల్‌పై స్థానికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా రాత్రి 10:30 గంటల తర్వాత హోటళ్లు, దుకాణాలు మూతపడుతున్నప్పటికీ, ఈ హోటల్ మాత్రం రాత్రి 11 గంటలు దాటినా కొనసాగుతుండటం చర్చనీయాంశంగా మారింది. విజయవాడ–భద్రాచలం ప్రధాన రహదారిపై ఉన్న ఈ హోటల్ “మాకు మా నిబంధనలు” అన్నట్టుగా వ్యవహరిస్తోందని స్థానిక వ్యాపారులు ఆరోపిస్తున్నారు.
రాత్రి సమయంలో సిగరెట్లు కొరత సృష్టించి అధిక ధరలకు విక్రయించడం, కూల్ డ్రింక్స్ సహా ఇతర వస్తువులను ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరలకు అమ్మడం జరుగుతోందని వినియోగదారులు చెబుతున్నారు. ముఖ్యంగా లారీ డ్రైవర్లు, కూలీ కార్మికులు రాత్రి వేళల్లో కొనుగోలు చేయక తప్పని పరిస్థితి ఉండటంతో ఈ అధిక ధరల భారం వారిపైనే పడుతోంది. ప్రశ్నించిన వారిపై హోటల్ సిబ్బంది దురుసుగా ప్రవర్తిస్తున్నారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.
ఇంకా తీవ్ర ఆరోపణల ప్రకారం, టీ అమ్మకాల పేరుతో రాత్రి వేళల్లో మద్యం విక్రయాలు కూడా జరుగుతున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది నిజమైతే చట్ట విరుద్ధ చర్యగా పరిగణించాల్సిందే. ఇటీవల కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలో మత్తులో ఉన్న యువత రాత్రి వేళల్లో దుకాణాలపై దాడులకు పాల్పడుతున్న ఘటనలు వెలుగులోకి రావడంతో, ఇలాంటి హోటళ్ల కార్యకలాపాలు భద్రతాపరంగా కూడా ఆందోళన కలిగిస్తున్నాయి.
ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ పరిసరాల్లో ఇతర హోటళ్లు, దుకాణాలు పోలీసుల ఆదేశాలతో సమయానికి మూసివేస్తున్నప్పటికీ, మలబార్ హోటల్ మాత్రం అదే నియమాలకు లోబడకపోవడం “మాకు ఒక న్యాయం, వారికి మరో న్యాయమా?” అన్న ప్రశ్నలను రేకెత్తిస్తోంది. స్థానిక వ్యాపారులు కూడా ఈ విషయంలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ప్రజల భద్రత, వినియోగదారుల హక్కులు, వ్యాపార సమానత్వం దృష్ట్యా సంబంధిత అధికారులు, పోలీస్ ఉన్నతాధికారులు ఈ అంశంపై దృష్టి సారించి విచారణ జరిపి అవసరమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. అన్ని హోటళ్లు పాటించే విధంగా క్లోజింగ్ టైమ్‌ను ఈ హోటల్ కూడా కచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.