ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ కోసం సీపీఐ పోరాటం
#CPI #andhrapradesh #vijayawada #housing rights #andhrapradesh politics
భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో విజయవాడ నగరంలోని మొగల్రాజపురం రెవెన్యూ పరిధిలోని సర్వే నెం.1/1A ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలకు పూర్తి హక్కులతో ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ చేయాలని కోరుతూ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మొగల్రాజపురంలోని బోయపాటి మాధవరావు గ్రంథాలయం నుంచి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు ప్రదర్శనగా వెళ్లిన సీపీఐ నాయకులు, స్థానిక నివాసితులు జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.
ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్, నగర కార్యదర్శి జి. కోటేశ్వరరావు నేతృత్వం వహించారు. కలెక్టర్‌ను కలిసిన ప్రతినిధి బృందం, మొగల్రాజపురం ప్రాంత ప్రజలు ఎన్నో దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న సమస్యలను వివరించింది.
జల్లి విల్సన్ మాట్లాడుతూ, బ్రిటిష్ పాలన కాలంలోనే ఈ ప్రాంత ప్రజలకు బి-ఫారాలు మంజూరు చేశారని, స్వాతంత్ర్యం అనంతరం కూడా ఇళ్లులేని పేదలకు కమ్యూనిస్టు నాయకుల పోరాట ఫలితంగా ఇళ్ల స్థలాలు కేటాయించి పట్టాలు ఇచ్చారని గుర్తుచేశారు. ప్రస్తుతం వేలాది కుటుంబాలు అక్కడ శాశ్వత నివాసాలు ఏర్పాటు చేసుకుని జీవిస్తున్నప్పటికీ, వారికి పూర్తి హక్కులతో రిజిస్ట్రేషన్ జరగకపోవడం అన్యాయమన్నారు.
ఇంటి పన్నులు, నీటి పన్నులు, ఇతర మున్సిపల్ పన్నులు క్రమం తప్పకుండా చెల్లిస్తున్న ప్రజలకు ఇప్పటికీ యాజమాన్య హక్కులు లేకపోవడం వల్ల విద్య, వైద్యం, వివాహాలు వంటి అవసరాల కోసం తమ ఇళ్లను బ్యాంకుల్లో హామీగా పెట్టుకునే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కమ్యూనిస్టు ప్రజాప్రతినిధులు ఉన్న సమయంలో ఈ ప్రాంతానికి మంచినీరు, డ్రైనేజీ, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలు కల్పించామని తెలిపారు.
మొగల్రాజపురం పరిసరాల్లో ఉన్న పురాతన గుహల పరిరక్షణ పేరుతో కేంద్ర పురావస్తు శాఖ ఇళ్ల రిజిస్ట్రేషన్లకు అభ్యంతరాలు తెలుపుతోందని, దాని ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా రిజిస్ట్రేషన్లు నిలిపివేయడం ప్రజల హక్కులపై దాడిగా అభివర్ణించారు. గ్రామకంఠం పరిధిలోని భూములను ప్రస్తుతం ఎవరి స్వాధీనంలో ఉన్నాయో వారికి పూర్తి హక్కులతో రిజిస్ట్రేషన్ చేయాలని సీపీఐ డిమాండ్ చేసింది.
ఈ సందర్భంగా నగర కార్యదర్శి జి. కోటేశ్వరరావు మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్ల ఇళ్ల స్థలాలు, అలాగే ఇళ్ల నిర్మాణానికి రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందిస్తామని హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ దిశగా ఎలాంటి చర్యలు చేపట్టలేదని విమర్శించారు. ఇప్పటికే పేదలకు ఇచ్చిన ఇళ్ల పట్టాలను కూడా రిజిస్ట్రేషన్ చేయకుండా నిర్లక్ష్యం చేయడం దారుణమన్నారు.
ప్రభుత్వం వెంటనే స్పందించి మొగల్రాజపురం ప్రాంత ప్రజలకు పూర్తి హక్కులతో ఇళ్ల రిజిస్ట్రేషన్లు చేపట్టాలని, లేనిపక్షంలో సీపీఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. కొండ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలకు కూడా తక్షణమే రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు.