దేవాలయాల ఆస్తులు సేఫేనా?

Mar 25, 2026 - 10:09
 0  2
దేవాలయాల ఆస్తులు సేఫేనా?

దేవుడు, దేవాలయం అంటే మనకు గుర్తొచ్చేది భక్తి మాత్రమే. వెళతాం దండం పెట్టుకుంటాం.. దక్షిణ వేస్తాం.. ప్రసాదం కొనుక్కుని తింటూ వచ్చేస్తాం. హమ్మయ్య దైవ దర్శనం అయింది.. ఇక మనకు మంచే జరుగుతుందనే నమ్మకంతో తిరిగి వెళతాం. కాని ఆ దేవుడి చుట్టూ.. ఆ దేవాలయం చుట్టూ ఏం జరుగుతుందో మనం గమనించం. ఎంతమంది ఎన్ని రకాలుగా ఆ దేవాలయాన్ని అడ్డు పెట్టుకుని ఎలా దోచుకుంటున్నారో అసలే గుర్తించలేం. ఎందుకంటే అంత పెద్ద పెద్ద వాళ్లే.. రాజకీయ నాయకులే ఉంటారు అందులో. వారి ఆధ్వర్యంలోనే అన్నీ జరుగుతుంటాయి. మరి ఇంత జరుగుతుంటే భగవంతుడు ఊరుకుంటాడా అని అమాయకంగా అడగకండి.. వారికి ఏదో ఒక టైములో శిక్ష వేస్తాడేమో మనకు తెలియదు. 
అసలు మన ఏపీలో దేవాలయాలు 27, 105 లెక్కలో ఉన్నవి. అందులో 4 వేల వరకు పెద్ద పెద్ద టెంపుల్స్. వీటన్నిటి కింద 4 లక్షల 65 వేల ఎకరాల భూములున్నాయి. వీటిలో 87 వేల ఎకరాలు ఆక్రమణకు గురయ్యాయి. దాదాపు 50 వేల ఎకరాలు నిరుపయోగంగా ఉన్నాయి. మిగతా వాటి మీద ఎంతొస్తుంది.. సక్రమంగా వస్తుందా లేదా చూడటానికి వ్యవస్ధలైతే ఉన్నాయి.. కాని అవి సరిగా పని చేస్తున్నాయో లేదో చెక్ చేస్తేనే తెలుస్తోంది. చేస్తున్నారా లేదా అంటే మనకు సమాధానం ఉండదు. అంతేకాదు దేవాదాయ శాఖ కింద 2563 షాపులు, 1513 భవనాలు, 1336 కల్యాణ మండపాలు ఉన్నాయని కొన్ని లెక్కలు చెబుతున్నాయి. అన్నిటి ద్వారా ప్రతి ఏడాది దేవాదాయ శాఖకు రు.210 కోట్లు ఆదాయం వస్తుందంట. అయితే ఇవన్నీ కరెక్టు కాదా అధికారికంగా తెలియదు.
అందుకే కృష్ణాజిల్లా విశ్వహిందూపరిషత్ నేతగా ఉన్న డాక్టర్ బూరగడ్డ శ్రీనాథ్ సమాచార హక్కు చట్టం ద్వారా ప్రభుత్వానికి అప్లయ్ చేశారు. మొత్తం వివరాలు కావాలని కోరారు. ఆయన చెప్పినదాని ప్రకారం ’’దేవాదాయ శాఖ కింద చాలా వనరులున్నాయి. అవి సద్వినియోగం అవుతున్నాయా.. దుర్వినియోగం అవుతున్నాయా.. పర్యవేక్షణ ఉందా లేదా అర్ధం కావడం లేదు. తిరుమల లడ్డూ ప్రసాదం లాంటిదే వివాదంలో చిక్కుకుంటే మిగతావాటి పరిస్ధితి ఏంటి? పైగా అర్చకులకు ప్రభుత్వం పేమెంట్ ఇస్తుంది. ఆ వివరాలు కూడా అడిగాం. హిందూ దేవాలయాలే కాకుండా ప్రభుత్వం పేమెంట్ ఇస్తున్న పాస్టర్లు, ఇమామ్‌ల వివరాలు కూడా అడిగాం. ఎందుకంటే ప్రభుత్వ సొమ్ము ఇస్తున్నప్పుడు ఏ ప్రాతిపదికన లబ్దిదారులను గుర్తిస్తున్నారనేది కూడా కీలకమే.’’
ఇక విశ్వహిందూపరిషత్ అయితే త్వరలోనే ఆంధ్రప్రదేశ్‌లోని దేవాలయాలు, వాటి ఆస్తుల పరిరక్షణకు పెద్ద ఎత్తున ఉద్యమించబోతుందని సమాచారం. ప్రభుత్వంలో ఎవరున్నారనేది సంబంధం లేకుండా దేవాలయాలు ఏ పరిస్తితిలో ఉన్నాయో తెలుసుకుని వాటి రక్షణకు నడుం కట్టబోతున్నారని తెలుస్తోంది. అయితే త్వరలోనే దేవాలయాలన్నీ చర్చకు రావడం ఖాయమనే అనిపిస్తోంది.