కబ్జాలో చల్లపల్లి భూములు...కబ్జాదారులెవరు?

#KrishnaDistrict #Mopidevi #TempleLands #ChallapalliRaja #LandDispute #DevadayaLands #KrishnaNews #AndhraPradesh #TempleProperties #LandEncroachment

May 15, 2026 - 10:21
May 15, 2026 - 11:40
 0  17
కబ్జాలో చల్లపల్లి భూములు...కబ్జాదారులెవరు?

కుమార్ చంద్ పుల్లగూర 

ఏళ్ళ చరిత్ర ఉన్న భూములవి.. భూములంటే.. ఏవో చిన్న చిన్న సెంటు భూములు కావు.. ఏకంగా ఎకరాలెకరాలు.. దాదాపు 55 సంవత్సరాలుగా కొందరు ఆక్రమణదారుల పాలై నేటికీ.. వారి భూములుగా చలామణి అవుతూ.. వారే అనుభవిస్తూ వారి చేతుల్లోనే ఆ భూములు మగ్గిపోతున్నాయి. ఆఖరుకి ప్రభుత్వానికి సిస్తు కడుతున్నారో లేదో అన్న అనుమానాలు కూడా రాకపోవు. కృష్ణాజిల్లాను పాలించిన చల్లపల్లి శ్రీమంతు రాజావారు దేవాలయ అభివృద్ధి కోసం ఇచ్చిన భూములు అన్యాక్రాంతమై ప్రస్తుతం కొందరి ఆస్థులుగా చలామణి అవుతున్నాయి. వీటిపై గతంలో అంటే 1987 ప్రాంతంలో కొన్ని సంవత్సరాలు కోర్టుల్లో కేసులు కూడా నడిచాయి. ఆ తర్వాత రాజావారి తదనంతరం ఆ భూములు వారి పాలై పూర్తిగా ఆదరణకు నోచుకోకుండా పోయాయి. 

వివరాల్లోనికి వెళితే.. కృష్ణాజిల్లా మోపిదేవి మండలం మెరకనపల్లి టేకుపల్లి గ్రామాల్లో ఉన్న 37 ఎకరాల చల్లపల్లి రాజావారి భూమి కృష్ణాజిల్లాను పరిపాలించిన చల్లపల్లి శ్రీమంతు రాజావారివి. ఆయన వారి కుటుంబ ఇలవేల్పు అయిన శ్రీ నగర పురి దుర్గా భవాని మహారాణి మహిషాసుర మర్దిని అమ్మవారు(బందరు) (శివగంగ అమ్మవారు) దేవాలయానికి దానం చేశారు. ఆలయ అభివృద్ధి కోసం ఆ భూముల్ని ఆయన దారాదత్తం చేస్తే అప్పట్లో కొందరు రైతులు కౌలు చేస్తామంటూ తీసుకుని వాటిని మెల్లమెల్లగా వారి భుక్తిని నింపుకోవటానికే అన్నట్లు ఆ భూముల్లో పండిన పంటల్ని పూర్తిగా వారే అమ్ముకున్నారు. ఈ నేపధ్యంలోనే ఆ భూముల నిమిత్తం 1986 వరకు ఏలూరు సెటిల్మెంట్ కోర్టు లో కేసు నడిచింది. ఈ భూములపై మండల రెవెన్యూ అధికారికి ఓ వ్యక్తి అర్జీ కూడా పెట్టుకున్నారు. అయినా ఫలితం లేకపోయింది. 

మోపిదేవి మండలం మెరకనపల్లి పంచాయతీ టేకుపల్లి గ్రామంలో ఉన్న ఈ భూములు శ్రీ నగర పురి దుర్గా భవాని మహారాణి మహిషాసుర మర్దిని అమ్మవారు(బందరు) (శివగంగ అమ్మవారు) దేవాలయం కింద ఉన్నాయి. అయితే ఈ భూములు ప్రభుత్వ సీలింగ్ భూములా లేక గ్రామ నిరుపయోగ భూములా(సర్ప్లస్ ల్యాండ్) అన్న విషయాన్ని ప్రభుత్వాధికారులే చెప్పలేని స్థితిలో ఉన్నారు. ఒకవేళ ఈ భూములను వినియోగిస్తున్న వారెవరైతే ఉన్నారో వారు తాశీలు చెల్లించాలి కానీ తాశీలు ఎవరు చెల్లిస్తున్నారు అనే ప్రశ్నకు సమాధానం లేదు. ఆరోపణలున్న ఈ భూములపై దేవాదాయశాఖ ఇన్స్పెక్టర్ అయితే తమ కింద లేవని తేల్చి చెప్పారు. ఇక ఈ భూములు చల్లపల్లి రాజా వారివా..? లేక పండించుకుంటున్న రైతులవా..? అసలు ప్రభుత్వ రికార్డులలో రికార్డ్ అయిన వివరాలు ఏంటి. గ్రామ కంటకమా?, ప్రభుత్వ భూమా? చల్లపల్లి రాజా గారి సంపద? గవర్నమెంట్ కార్డు వాల్యూ ఎలా ఉన్నా, సగటున ఎకరం ప్రైవేటు రేటు 24-25 లక్షలు పలుకుతుంది. మరి ఇంతటి విలువైన భూములు ఎవరివి?అన్నది ప్రశ్నార్థకంగా మారిపోయింది. ఈ 37 ఎకరాల మాట ఎలా ఉన్నా.. ఇలాంటి భూములు మరో 100 ఎకరాలు కృష్ణాజిల్లాలోనే ఉన్నాయి. వాటికి సంబంధించిన వివరాలను త్వరలోనే మీముందుకు తెస్తాం.