కరీంనగర్‌లో గరం గరం.. కౌశిక్ ‌వర్సస్ సంజయ్..!

#karimnagar #Sanjay #kaushik #Telangana

May 7, 2026 - 14:06
 0  4
కరీంనగర్‌లో గరం గరం.. కౌశిక్ ‌వర్సస్ సంజయ్..!

కరీంనగర్‌లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తొలి నుంచి వివాదాస్పద వ్యాఖ్యలు, వ్యవహారంతో నిత్యం వార్తల్లో ఉంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కార్యాలయంపై బీజేపీ నేతలు, కార్యకర్తలు దాడి చేశారు. దాడి సమయంలో కౌశిక్ ఆయన కార్యాలయంలోనే ఉన్నారు. నేరుగా కార్యాలయం వచ్చిన బీజేపీ నేతలు.. ముందు బయటే ఉన్న కార్లను ధ్వంసం చేశారు. ఆ తర్వాత కార్యాలయంపై రాళ్లతో దాడి చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో.. కౌశిక్ రెడ్డిని మరో గదిలోకి తీసుకెళ్లారు. కేంద్ర మంత్రి బండి సంజయ్‌పై కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగానే బీజేపీ నేతలు దాడి చేశారు. దాడి విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ నేతలు.. బీజేపీ కార్యాలయంపై దాడికి యత్నించారు. అయితే పరిస్థితి ఉద్రికంగా మారటంతో.. పోలీసులు బీఆర్ఎస్ నేతలను అదుపులోకి తీసుకున్నారు.

కరీంనగర్ పర్యటనకు వచ్చిన కౌశిక్ రెడ్డి.. కరీంనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ను ఆయన కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఆ తర్వాత కేంద్ర హోమ్ శాఖ పనితీరుపై తీవ్ర విమర్శలు చేశారు. ఆ శాఖ సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్ పై ఘాటు విమర్శలు చేశారు. వ్యక్తిగత దూషణకు పాల్పడ్టారు. తెలంగాణలో, దేశంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని.. ఘాటు వ్యాఖ్యలు చేసిన కౌశిక్ రెడ్డి.. ముఖమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి బండి సంజయ్‌పై తీవ్ర పదజాలంతో రెచ్చిపోయారు. దీంతో బీజేపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహంతో గంగుల కమలాకర్ కార్యాలయంపై దాడి చేశారు. కార్యాలయం ఫర్నీచర్ ధ్వంసం చేశారు.

ఈ దాడి తర్వాత కూడా కౌశిక్ రెడ్డి మరింత రెచ్చిపోయారు. తనను హత్య చేసేందుకు రేవంత్ రెడ్డి, బండి సంజయ్ తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారన్నారు. కత్తులు, పెట్రోల్ బాంబులతో తనపై దాడి చేశారన్నారు. అసలు కరీంనగర్‌లో లా అండ్ ఆర్డర్ లేదని.. అది ఇవాళ రుజువైందన్నారు. ఏం తప్పు చేశానని దాడి చేశారని కౌశిక్ ప్రశ్నించారు. బీజేపీ, కాంగ్రెస్ నేతలు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావును నోటికి వచ్చినట్లు బూతులు తిడుతున్నారని.. వాళ్లు అంటే కరెక్ట్ అవుతుంది.. మేము అదే మాటలు అంటే తప్పు అవుతుందా.. అని నిలదీశారు. కేటీఆర్ డ్రగ్స్ టెస్టుకు సిద్ధమని.. మరి బండి సంజయ్ కూడా సిద్ధమా అని సవాల్ విసిరారు. తనపై రౌడీ షీటర్లు దాడికి యత్నించారని.. దాడిపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.

కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బూతులు తిట్టడమే ఏకైక లక్ష్యం అన్నట్లుగా బీఆర్ఎస్ నేతలు వ్యవహరిస్తున్నారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు విమర్శించారు. అయితే భౌతిక దాడులు సమంజసం కాదన్నారు. ఎంత ఎక్కువ బూతులు మాట్లాడితే.. అంత పెద్ద నాయకుడు అన్నట్లుగా బీఆర్ఎస్ నేతలు వ్యవహరిస్తున్నారని రఘునందర్ ధ్వజమెత్తారు. బూతుల సంస్కృతిని కేటీఆర్ ప్రొత్సహిస్తున్నారని.. తాము కూడా బీఆర్ఎస్ మాదిరి వ్యవహరిస్తే.. తట్టుకోలేరని వార్నింగ్ ఇచ్చారు. మరోవైపు సిరిసిల్లలో బండి సంజయ్ పర్యటన నేపథ్యంలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. కేటీఆర్‌పై బండి సంజయ్ వ్యాఖ్యలకు నిరసనగా బీఆర్‌ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగారు. కేంద్ర మంత్రి పర్యటనను అడ్డుకునేందుకు గులాబీ శ్రేణులు సిద్ధమయ్యారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు.. పలువురు బీఆర్‌ఎస్ శ్రేణులను ముందుస్తుగా అరెస్ట్ చేశారు.