హనీ ట్రాప్ కలకలం.. అధికారులపై అనుమానం?

#అనంతపూర్ # honey trap #officers #police

Apr 24, 2026 - 10:31
 0  3
హనీ ట్రాప్ కలకలం.. అధికారులపై అనుమానం?

వయ్యారపు వలపాలతో బడా వ్యక్తులను వలలో వేసి కోట్లు దోచుకుంటున్న హనీ ట్రాప్ ముఠా గుట్టు రట్టైంది. ముఠా సభ్యుల మధ్య తలెత్తిన అంతర్గత వివాదంతో ఈ దందా బయటపడటం జిల్లాలో సంచలనం రేపింది. యువతులను ఉపయోగించి ప్రముఖులను లక్ష్యంగా చేసుకుని నగ్న ఫోటోలు తీసి బ్లాక్‌మెయిల్ చేస్తూ భారీ మొత్తాలు వసూలు చేస్తున్న ఈ నయా మోసగాళ్ల బారి ఎన్నో కుటుంబాలను దెబ్బతీసింది.

వ్యూహాత్మకంగా నడిచిన దందా

ఈ ముఠా పని తీరే భయంకరం. ముందుగా ఒక మహిళను “పని ఉంది” అంటూ లక్ష్యంగా ఎంచుకున్న వ్యక్తుల దగ్గరకు పంపించి పరిచయం పెంచుకుంటారు. అనంతరం వారిని ఏకాంత ప్రదేశాలకు పిలిచి, అదే సమయంలో ముఠా సభ్యులు దాడి చేసి నగ్న ఫోటోలు, వీడియోలు చిత్రీకరిస్తారు. ఆ తర్వాత రేప్ కేసులు పెడతామని, పరువు తీస్తామని బెదిరిస్తూ డబ్బులు వసూలు చేస్తారు.

లేడీ డాన్ రంగమ్మ కీలక పాత్ర

ఈ మొత్తం ఆపరేషన్‌కు నాయకత్వం వహించినది చిన్ని అలియాస్ రంగమ్మగా పోలీసులు గుర్తించారు. ముఠా కార్యకలాపాలన్నింటినీ ఆమెే ప్లాన్ చేసి అమలు చేసినట్లు సమాచారం. బాధితుల నుంచి డబ్బులు రాకపోతే పోలీసుల పేర్లు చెప్పి సెటిల్‌మెంట్లు చేసే ప్రయత్నాలు జరిగాయి.

పోలీసులపై ఆరోపణలు

ఈ వ్యవహారంలో కొంతమంది పోలీసు అధికారుల ప్రమేయం ఉందనే ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. బాధితులు ఫిర్యాదు చేసినా కేసులు నమోదు చేయకుండా పంచాయితీలు చేసి ముఠాకు సహకరించారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇప్పటికే రాప్తాడు సీఐ హర్ష, త్రీటౌన్ సీఐ రాజేంద్రనాథ్ యాదవ్‌లను ఉన్నతాధికారులు వీఆర్‌కు పంపడం ఈ ఆరోపణలకు బలం చేకూర్చింది.

బాధితులు.. కోట్లు వసూలు

ఇప్పటివరకు సుమారు 19 మందికి పైగా వ్యాపారులు, రియాల్టర్లు, చిన్న వ్యాపారులు ఈ ముఠా బారిన పడ్డట్లు తెలుస్తోంది. కొందరు భయంతో ఊరు విడిచి వెళ్లగా, ఓ బాధితుడు ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం.

అరెస్టులు.. దర్యాప్తు కొనసాగుతోంది

ఇప్పటికే ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వారి వద్ద నుంచి రూ.13 లక్షల నగదు, ఒక కత్తి స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో మరిన్ని ప్రముఖుల పేర్లు వెలుగులోకి వచ్చే అవకాశముందని సమాచారం.

జిల్లాలో ఉద్రిక్తత

ఈ హనీ ట్రాప్ వ్యవహారం బయటపడడంతో అనంతపురం జిల్లాలో తీవ్ర కలకలం నెలకొంది. మరెవరెవరికి ఈ ముఠాతో సంబంధాలున్నాయో అన్న భయం అధికార వర్గాల్లోనూ కనిపిస్తోంది. పోలీసులు చేపట్టిన దర్యాప్తులో ఇంకా అనేక కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశముంది.