లంచం ఇవ్వలేదన్న కక్షా?… 

Apr 1, 2026 - 10:15
 0  2
లంచం ఇవ్వలేదన్న కక్షా?… 

ఆర్థో సర్జన్ ఇంటి నిర్మాణం కూల్చివేతపై సంచలనం...

మండపేట పట్టణంలో ప్రముఖ ఆర్థో సర్జన్ డాక్టర్ రాము చేసిన ఆరోపణలు తీవ్ర చర్చకు దారితీశాయి. “అడిగినంత లంచం ఇవ్వలేదన్న అక్కసుతో మున్సిపల్ అధికారులు నా ఇంటి నిర్మాణాన్ని అన్యాయంగా కూల్చేశారు” అంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
డాక్టర్ రాము వెల్లడించిన వివరాల ప్రకారం… పట్టణంలోని సూర్యమహల్ వెనుక భాగంలో “శ్రీ సాయి ఆర్థో అండ్ ట్రామా కేర్” పేరుతో ఆసుపత్రి నిర్వహిస్తున్న ఆయన, భవిష్యత్ అవసరాల దృష్ట్యా భవనంపై అదనపు అంతస్తు నిర్మాణం చేపట్టారు. ఇందుకు గత ఏడాది సెప్టెంబర్‌లో మున్సిపల్ అనుమతుల కోసం అధికారులను సంప్రదించగా, రూ.1.5 లక్షలు లంచంగా తీసుకున్నారని ఆరోపించారు.


అయితే తరువాత మరో రూ.5 లక్షలు ఇవ్వాలని కమిషనర్ డిమాండ్ చేసినట్టు మున్సిపల్ సిబ్బంది ద్వారా సమాచారం అందిందని తెలిపారు. ఇప్పటికే భారీ మొత్తంలో డబ్బులు చెల్లించిన తాను, మరింత ఇవ్వడానికి నిరాకరించడంతో అధికారుల కక్ష పెరిగిందని చెప్పారు. తనపై ఎలాంటి నోటీసులు జారీ చేయకుండా, బీపీఎస్ నిబంధనలకు విరుద్ధంగా ఆసుపత్రి పైభాగంలో నిర్మించిన అంతస్తును కూల్చివేశారని డాక్టర్ రాము ఆరోపించారు. ఇది పూర్తిగా కక్షపూరిత చర్య అని ఆయన అన్నారు. తాను ఎస్టీ వర్గానికి చెందిన వ్యక్తినని, ఆ కారణంగానే అధికారులు తనను తక్కువగా చూసి అవమానించారని, కులం పేరుతో దూషించారని కూడా డాక్టర్ రాము ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు మరింత వివాదాస్పదంగా మారాయి.


మండపేటలో 119 అక్రమ నిర్మాణాలు ఉన్నాయని అధికారులే చెప్పినా, కేవలం 60 నిర్మాణాలపైనే చర్యలు తీసుకోవడం అన్యాయమని ఆయన విమర్శించారు. “ఎందుకు నన్నే టార్గెట్ చేశారు?” అంటూ ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై ఇప్పటికే కోర్టును ఆశ్రయించినట్లు డాక్టర్ రాము తెలిపారు. టౌన్ ప్లానింగ్ అధికారులు, మున్సిపల్ కమిషనర్ సహా 12 మందిపై కేసు నడుస్తోందని వెల్లడించారు. అయినప్పటికీ కేసు పురోగతి లేకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఇక సోమవారం నిర్వహించిన పీ–జీఆర్‌ఎస్‌లో జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి కు వినతిపత్రం సమర్పించి, తనకు న్యాయం చేయాలని కోరారు. 
ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి, నిజానిజాలు బయటపెట్టాలని స్థానికులు కోరుతున్నారు. లంచం ఆరోపణలు, కుల వివక్ష వ్యాఖ్యలు నిజమైతే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

మొత్తానికి… మండపేటలో ఈ కూల్చివేత ఘటన అధికారుల వైఖరి, అవినీతి ఆరోపణలు, సామాజిక వివక్ష వంటి అంశాలను ఒక్కసారిగా వెలుగులోకి తెచ్చి తీవ్ర చర్చకు దారితీసింది.