నడిరోడ్డుపై దారుణం: విలేకరి హత్య

#reportermurder #chittordistrict #andhrapradesh

Apr 29, 2026 - 10:14
 0  10
నడిరోడ్డుపై దారుణం: విలేకరి హత్య

చిత్తూరు జిల్లా, వీకోట మండలంలో  ఆంధ్రజ్యోతి విలేకరి జగన్ మోహన్ రెడ్డి పై మంగళవారం ఉదయం సుమారు 7 గంటల ప్రాంతంలో.. గుర్తు తెలియని ఇద్దరు దుండగులు కత్తులతో తీవ్రంగా దాడి చేసి, హత్య చేశారు. ఈ దుర్ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా మీడియా సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగాయి. తక్షణమే ఈ హత్యకు కారకులైన వారిని అరెస్టు చేసి, ఆ దుర్మార్గులను కఠినంగా శిక్షించాలని మీడియా ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు. గతంలో మీడియాపై దాడులు చేసిన ఘటనలో చూసేము కానీ, ఇలా పట్టపగలే ఒక విలేకరిని నడి రోడ్డుపై కత్తులతో దాడి చేసి చంపడం ఎంతో దారణమంటున్నారు. మీడియా ప్రతినిధులపై ఎవరు దాడి చేసిన, ఇలాంటి చర్యలకు పాల్పడిన ప్రత్యేక చట్టాలను తీసుకురావాలని మీడియా సంఘాలవారు డిమాండ్ చేశారు. ఈ సంఘటన తెలుసుకున్న వెంటనే చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడి సంఘటన స్థలానికి చేరుకుని, హత్య జరిగిన పరిస్థితులను, సంఘటనా స్థలాన్ని సమగ్రంగా పరిశీలించారు. సంబంధిత పోలీసు అధికారులతో మాట్లాడి ఈ ఘటనపై పూర్తి వివరాలను సేకరించాలని ఆదేశించారు.

సంఘటనా స్థలం, పరిసర ప్రాంతాలలో ఏర్పాటుచేసిన సీసీ కెమెరాలు క్షుణ్ణంగా పరిశీలించి దర్యాప్తుకు అవసరమైన ఆధారాలను సేకరించాలన్నారు. నిందితులను త్వరితగతిన గుర్తించి తక్షణమే అరెస్టు చేయాలని పోలీసు అధికారులను ఎస్పీ ఆదేశించారు. అనంతరం వీకోట ప్రాంతంలోని మీడియా ప్రతినిధులతో ఎస్పీ మాట్లాడుతూ ఈ హత్యకు గల కారణాలను లోతుగా విచారిస్తున్నామని నిందితులను యుద్ధ ప్రాతిపదికన గుర్తించి అరెస్టు చేస్తామని వారికి హామీ ఇచ్చారు. దర్యాప్తు పూర్తి అయ్యేవరకు మీడియా మిత్రులు సమయమనం పాటిస్తూ పోలీసులకు సహకరించాలని ఎస్పి విజ్ఞప్తి చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరు మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడకూడదని, సమాజంలో అశాంతి కలిగించే ప్రచారాలకు దూరంగా ఉండాలని కోరారు. ఏటువంటి భావేద్వేగపూరిత లేదా అపోహలను సోషల్ మీడియా వేదికలలో పోస్ట్లు చేయకుండా బాధ్యతాయుతంగా ఉండాలని ఎస్పి కోరారు. 

ఇదిలా ఉండగా.. జగన్ మోహన్ రెడ్డికి రెండు కోళ్ల ఫారాలు ఉన్నాయని, అతను ఎవరిపై ఆధారపడకుండా.. ఎలాంటి సెటిల్మెంట్ లకు తావు లేకుండా, అతని పని అతను చేసుకుంటూ వెళ్తాడనే మంచి పేరు ఉందని.. కానీ గతంలో ఇద్దరు వ్యక్తులు గంజాయి కేసులో కర్ణాటక పోలీసులకు పట్టు పడ్డారని,  వారిలో ఒకరిని తప్పించేందుకు ఈ జగన్ మోహన్ రెడ్డి సహాయ సహకారాలు అందించారని, దానిని మనసులో పెట్టుకొని మరొక నిందితుడు నన్ను ఒక్కడినే కావాలని ఇరికించారనే ఉద్దేశంతో కక్షగట్టి ఈ హత్యకు పాల్పడినట్లు స్థానికుల సమాచారం. నిందితుడు తాయ్లూరు పరిసర ప్రాంతాల్లో ఉన్నట్లు సమాచారం. దీనికోసం ప్రత్యేకించి నాలుగు పోలీసు బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తున్నామని, నిందితుడు దొరికితే గాని పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని స్థానిక పోలీసులు అధికారులు చెప్తున్నారు.