"వర్మ నోరు జారారు.. అనకూడని మాట అనేశారు"
#politics #పిఠాపురం #పవన్ కళ్యాణ్ #వర్మ
వర్మ నోరు జారారు.. అనకూడని ఒక మాట అనేశారు. నాలుగు అనిపించుకుంటున్నారు కూడా ఈ పిఠాపురం వర్మ. ఇప్పుడు పిఠాపురం అంటే పవన్ కళ్యాణ్ పేరే తప్పా మరో పేరు వినిపించదు. అయినా కూడా టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ చేస్తున్న అనవసర హడావుడి రాద్ధాంతాలు టీడీపీ పెద్దలను ఇరకాటంలో పడేశాయి. ఎంత తొందరగా పిఠాపురం నుండి వర్మను తప్పిస్తే తెలుగుదేశం పార్టీకి కూడా అంత మంచిది. లేకుంటే రోజూ ఇవే రాద్దాంతాలు.. ఫొటోల గొడవలతో ప్రారంభమైన కొట్లాటలు, విమర్శలు ముదిరి పాకాన పడ్డాయి. పిఠాపురం టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మతో మాకు తలనొప్పులు పెరిగాయి. ఇది మా ఖర్మ అని టీడీపీ కార్యకర్తలు, పార్టీ సానుభూతిపరులే తలలు పట్టుకుంటున్నారు.
ప్రస్తుతం ఎన్నికల్లో కులం, ధనం, మతం పనిచేస్తుందని తెలిసి కూడా వర్మలో మార్పు రాలేదంటే.. ఆయనే తన గురించి తాను ఎంత అతిగా, ఎక్కువగా ఉహించుకుంటున్నారో..! ఎన్నికల్లో పవన్ కళ్యాణ్‌ను తానే గెలిపించానన్న భ్రమలో వర్మ ఉన్నట్లుగా ఆయన చేసే కామెంట్లను బట్టి స్పష్టమవుతోంది. తాజాగా వర్మ చేసిన స్థానికత, స్థానికేతరత కామెంట్లు టీడీపీ ప్రముఖులందరికీ తలనొప్పి తెచ్చి పెట్టింది. అసలు విషయం ఏమిటంటే.. టీడీపీ పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ స్థానికతపై అనవసరంగా నోరు జారారు. మేము ఇక్కడే పుట్టాం.. ఇక్కడే పెరిగాం.. ఇక్కడే పోటీ చేశామన్నారు. మూడు దఫాలు ఎమ్మెల్యేగా పోటీచేస్తే ఒక సారి మాత్రమే ఆయన గెలిచారు. వర్మ కులం ఓటర్లు పిఠాపురంలో చాలా తక్కువ. ఏదో అదృష్టం కలిసొచ్చి ఒకేసారి గెలిచాక వర్మలో అహం పెరిగిందేమో..!
ముద్రగఢ పద్మనాభ రెడ్డి ఇక్కడ నుంచి పోటీ చేసి ఘోరంగా ఓడిపోయారు. ఆయన కూడా స్థానికుడు కాదు. వర్మ గారి స్థానికత కామెంట్లపై ఒక జనసేన నాయకుడు సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. చంద్రగిరి నియోజకవర్గానికి చెందిన చంద్రబాబు కుప్పం వలస వెళ్లి ఎనిమిది సార్లు గెలిచారు. హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన లోకేష్ కూడా గుంటూరు జిల్లా మంగళగిరి నుంచి ఒకసారి ఓడిపోయినా, రెండోసారి భారీ మెజారిటీతో విజయం సాధించారు. మద్రాసులో పుట్టిన నందమూరి బాలకృష్ణ హైదరాబాద్‌లో ఉంటూ హిందూపూరం నియోజకవర్గం నుంచి వరుసగా మూడు దఫాలు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అలాగే హైదరాబాద్, కారంచేడులో ఉండే ఎన్టీఆర్ కుమార్తె దగ్గుపాటి పురందేశ్వరి కూడా విశాఖ, రాజమండ్రి నుంచి ఎంపీ గా పోటీ చేసి గెలిచారు.
ప్రజారాజ్యం పార్టీ పెట్టిన చిరంజీవి కూడా తిరుపతి నుండి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఇలా చెప్పుకుంటూ పోతే అనేకమంది ప్రముఖులు, సొంత నియోజకవర్గాల్లో పోటీ చేయటం లేదు. వారంతా మరోచోట నుండి పోటీ చేసి విజయం సాధించిన వారే. ఒక్క పవన్ కళ్యాణ్ విషయంలో మాత్రమే స్థానికేతరత రాద్దాంతం ఎందుకు..? చంద్రబాబు, లోకేష్, బాలకృష్ణ సొంత నియోజకవర్గాలను వద్దనుకున్నారు. పుట్టి పెరిగిన తెలంగాణ రాష్టంలో కాకుండా..ఏపీకి వలస వచ్చారు. ఎమ్మెల్యేలు అయ్యారు. ఇవన్నీ మరిచిన వర్మ.. స్థానికతను మాట్లాడి.. తన పరువును తానే తీసుకోవటమే కాకుండా చంద్రబాబు, లోకేష్, బాలకృష్ణ పరువు కూడా తీసేశారు.