నెల్లూరులో సీలింగ్ భూములపై కబ్జా మాఫియా
#Nellore #Andhrapradesh #landmafia
సుమన్ బాబు
నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం కరివేడు గ్రామ పరిధిలో ఉన్న సుమారు 2,395 ఎకరాల సీలింగ్ భూములపై భారీ స్థాయిలో అక్రమాల ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఒకప్పుడు పెద్దగా విలువలేని ఈ భూములు, ప్రస్తుతం చెన్నై–నెల్లూరు జాతీయ రహదారి, కృష్ణపట్నం పోర్టు, దుగ్గరాజపట్నం, రామాయపట్నం ఓడరేవులకు సమీపంలో ఉండటంతో ఎకరా ధర రూ.కోటి దాటింది. దీంతో ఈ భూములపై రాజకీయ నాయకులు, ప్రైవేట్ వ్యక్తులు డేగకన్నేశారు.
1977లో ల్యాండ్ సీలింగ్ చట్టం కింద ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న ఈ భూములు దశాబ్దాలుగా ప్రభుత్వాధీనంలోనే ఉన్నాయి. సర్వే నంబర్లు 805, 876, 743 నుంచి 800, 367లో విస్తరించి ఉన్న ఈ భూములు గతంలో రిజిస్ట్రేషన్‌కు నిషేధం విధించినప్పటికీ, ఇటీవల దొంగ రికార్డుల సృష్టితో ప్రైవేటు పేర్లకు మారుతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా కొందరు రెవెన్యూ అధికారులు ఈ అక్రమాలకు సహకరిస్తూ కోట్ల రూపాయలు దండుకుంటున్నారనే విమర్శలు తీవ్రంగా ఉన్నాయి.
జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమయంలో చిల్లకూరు మండలం తిరుపతి జిల్లాలోకి వెళ్లి మళ్లీ నెల్లూరులో కలవడం అక్రమార్కులకు అనుకూలంగా మారిందని స్థానికులు అంటున్నారు. ఈ గందరగోళంలో కీలకమైన సీలింగ్ రికార్డులు, 2010లో ఆర్డీవో రూపొందించిన ఫైళ్లు, భూస్కెచ్‌లు గల్లంతయ్యాయని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆర్టీఐ ద్వారా సమాచారం కోరినా అధికారులు స్పష్టమైన సమాధానాలు ఇవ్వడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సుమారు 991 ఎకరాల భూమి ప్రైవేటు వ్యక్తుల పేర్లకు మారినట్లు ఆరోపణలు ఉన్నాయి. సర్వే నంబరు 805లో 221 ఎకరాలు, 367లో 170 ఎకరాలు, ఇతర సర్వే నంబర్లలో వందల ఎకరాలు అక్రమంగా మారినట్లు సమాచారం. ఈ వ్యవహారంపై పలుమార్లు ఫిర్యాదులు వచ్చినప్పటికీ, చర్యలు తీసుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది.
వాస్తవానికి ఈ భూములు రాష్ట్రానికి విలువైన ల్యాండ్ బ్యాంక్‌గా ఉండి పారిశ్రామికవాడ అభివృద్ధికి ఎంతో అనుకూలం. కానీ అక్రమాల కారణంగా ప్రభుత్వానికి భారీ నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. అందుకే సీలింగ్ రికార్డులను తిరిగి వెలికితీసి, భూములపై పూర్తి స్థాయి సర్వే నిర్వహించి, అక్రమాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అధికార, ప్రతిపక్ష నేతలు, ఉన్నతాధికారులు, బడా వ్యాపారవేత్తలు ఎవరు ఉన్నా ఈ భూములను కాపాడాలని, ప్రజల ఆస్తిని పరిరక్షించాలని స్థానికులు ప్రభుత్వాన్ని గట్టిగా కోరుతున్నారు. ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.