అడ్డుకట్ట వేసేదెవ్వరు..?
కుమార్ చంద్ పుల్లగూర
రోజురోజుకీ విజయవాడ నగరంలో రోడ్ల ఆక్రమణలకు హద్దూపద్దూ లేకుండాపోయింది. ప్రత్యేకించి బందరు రోడ్డులో అయితే ఈ ఆక్రమణలు పెచ్చురిల్లిపోతున్నాయనే చెప్పాలి. ప్రధానంగా బందరు రోడ్డు అంటేనే.. పెద్దపెద్ద బడా బడా షాపింగ్ మాల్స్ కు నెలవు. అటువంటి ఈ సువిశాలమైన రోడ్డును, ఈ రోడ్డుకు అనుసంధానంగా ఉన్న వీధి రోడ్లను కూడా ఆక్రమించేస్తున్నారు బడా షాపింగ్ వ్యాపారులు..ఇష్టారాజ్యంగా మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ పరిధిలోని రహదారులను షాపింగ్ కి వచ్చే వారి వెహికల్స్ కు పార్కింగ్ ప్రదేశాలుగా వాడుకుంటున్నారు. సాయంత్రం సమయాల్లో ఈ పరిస్థితి మరీ పెరిగిపోయి ట్రాఫిక్ కు కూడా అంతరాయం ఏర్పడుతుందంటే అతిశయోక్తి కాదు. ఇక ట్రాఫిక్ పోలీసులు సైతం.. పలుమార్లు రోడ్లపై నిలిపిన వాహనాలను త్రోబింగ్ చేయటంతో పాటు ఫైన్స్ వేశారు కూడా. అయినా కూడా ఈ షాపింగ్ మాల్స్ యాజమాన్యాలు ఏ మాత్రం మారకుండా.. తమదైన వైఖరితో ఒక కొత్త విధానానికి తెరతీశారు. అదేంటంటే.. షాపింగ్ మాల్స్ కి సంబంధించిన ప్రైవేటు సెక్యూరిటీ టీమ్‌ను ఈ పార్కింగ్ లు అక్రమ ఆక్రమణలకు పర్యవేక్షకులుగా పెట్టి ప్రయివేటు సైన్యంతో సదరు మున్సిపల్ ప్రదేశాలను యద్దేచగా పార్కింగ్ ప్రదేశాలుగా తమ అవసరాలకు అనుగుణంగా వాడుకుంటున్నారు. ఇదంతా జరుగుతున్నప్పుడు..రెండు వ్యవస్థలు ప్రధానంగా చర్యలు చేపట్టాల్సి ఉండగా.. ఆ రెండు చూసి చూడనట్లుగా వెళ్తున్నాయన్న విమర్శలు లేకపోలేదు. ఏది ఏమైనా.. రోజురోజుకీ ఆయా షాపింగ్ మాల్స్ ఆగడాలు మరీ పేట్రేగిపోతున్నాయనే చెప్పాలి. నిబంధనల ప్రకారం షాపింగ్ మాల్ లీజుకు తీసుకునే బిల్డింగ్ లేదా కాంప్లెక్స్ సేఫ్టీ నిబంధనలకణుగుణంగానే నిర్మిస్తారు. దీంతో సహజంగానే ఆయా కాంప్లెక్స్ లకు ప్రత్యేకించి పార్కింగ్ ను గ్రౌండ్ ఫ్లోర్ లేదా అండర్ గ్రౌండ్ లలో ఏర్పాటు చేసి ఉంచుతారు. అప్పుడు షాపింగ్ మాల్ లేదా.. సదరు బట్టల దుకాణం వారు ఆ పార్కింగ్ ప్రాంతాన్ని మాత్రమే వాడుకోవాలి కానీ బిల్డింగ్ చుట్టూ.. లేదా బిల్డింగ్ లేదా కాంప్లెక్స్ ఎదురుగా ఉన్న మున్సిపల్ ప్రాంతాన్ని పార్కింగ్ గా వినియోగించకూడదు. అటువంటి రోడ్లకు తమ షాపింగ్ మాల్ పేరు ఉన్న ట్రాఫిక్ డివైడర్లను ఏర్పాటు చేసి ఆ ప్రాంతంలో వాహనాలు పార్క్ చేసుకునే విధంగా షాపింగ్ మాల్స్ వారు చేస్తున్నారు. ఇక ఇదంతా చూస్తున్నా.. తమకు తెలిసినా.. టౌన్ ప్లానింగ్ అధికారులు మాత్రం చూసి చూడనట్లుగా వదిలేస్తున్నారు. ఇందుకు కారణం బడా షాపింగ్ మాల్స్ వారు ఇచ్చే ముడుపులు తాయిలాలను టౌన్ ప్లానింగ్ అధికారులు తినటమే అని సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. వారితో పాటు టౌన్ ప్లానింగ్ ఉన్నతాధికారులకు షేర్ ఇవ్వాల్సి ఉండటం వల్లే మరింతగా నిర్లక్ష్యాన్ని టౌన్ ప్లానింగ్ విభాగం అంతా ప్రదర్శిస్తోందని తెలుస్తోంది.
ఇకపై ఇలాంటి మరిన్ని సమస్యలను, మున్సిపల్ టౌన్ ప్లానింగ్ విభాగానికి సంబంధించిన పలు అంశాలను మరిన్ని వరుస కథనాలుగా ట్రూ పాయింట్ మీడియా మీ ముందుకు తీసుకురానుంది.