పిఠాపురం టీడీపీలో సంచలన మార్పులు.. వర్మకు షాక్

#TDP #పిఠాపురం #varma #andhrapradesh

May 7, 2026 - 15:18
 0  10
పిఠాపురం టీడీపీలో సంచలన మార్పులు.. వర్మకు షాక్

ఏపీ రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యత కలిగిన పిఠాపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. కొంతకాలంగా నియోజకవర్గ పార్టీ వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న మాజీ ఎమ్మెల్యే ఎస్‌వీఎస్‌ఎన్ వర్మను నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ బాధ్యతల నుంచి పార్టీ అధిష్ఠానం తప్పించింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కావడంతో, ఇక్కడ జరుగుతున్న పరిణామాలను టీడీపీ అధినాయకత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. 

కూటమి నేతల మధ్య సమన్వయం దెబ్బతినకుండా ఉండేందుకే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇటీవల పిఠాపురం నియోజకవర్గంలో టీడీపీ - జనసేన నాయకుల మధ్య చోటు చేసుకున్న వరుస వివాదాలే వర్మపై వేటు పడటానికి ప్రధాన కారణమని తెలుస్తోంది. ముఖ్యంగా పిఠాపురం ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ కార్యాలయంలో ఫ్లెక్సీల విషయంలో జనసేన నేత పెండెం దొరబాబు, వర్మ వర్గీయుల మధ్య జరిగిన ఘర్షణ రాష్ట్రస్థాయిలో చర్చనీయాంశమైంది. 

కూటమి ధర్మాన్ని విస్మరించి బహిరంగంగా గొడవలకు దిగడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే వర్మను పక్కన పెట్టి, నియోజకవర్గంలో పార్టీని చక్కదిద్దే బాధ్యతను కొత్త టీమ్‌ కు అప్పగించాలని నిర్ణయించారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ వ్యవస్థను ప్రస్తుతానికి రద్దు చేసిన అధిష్ఠానం, దాని స్థానంలో ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తోంది. పిఠాపురంలో పార్టీ కార్యక్రమాలను పర్యవేక్షించడం, కార్యకర్తలకు అండగా ఉండటం, కూటమి భాగస్వామ్య పక్షమైన జనసేనతో సమన్వయం చేసుకోవడం ఈ కమిటీ ప్రధాన బాధ్యతలు. 

వీలైనంత త్వరగా ఈ కమిటీని ప్రకటించి, నియోజకవర్గంలో నెలకొన్న గందరగోళానికి తెరదించాలని టీడీపీ భావిస్తోంది. పార్టీ సీనియర్ నేతలు, స్థానిక ముఖ్య నాయకులతో కూడిన ఈ బృందం ప్రత్యక్షంగా అధిష్ఠానం పర్యవేక్షణలో పనిచేయనుంది. సుదీర్ఘకాలం నియోజకవర్గంలో పార్టీని నడిపించిన వర్మను బాధ్యతల నుంచి తప్పించడం ఆయన అనుచరుల్లో కొంత అసంతృప్తిని కలిగించినప్పటికీ, పార్టీ క్రమశిక్షణే ముఖ్యం అని అధిష్ఠానం స్పష్టం చేసింది. అయితే, వర్మ సేవలను గుర్తించి ఆయనకు ఇప్పటికే పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్ష పదవిని కేటాయించారు. నియోజకవర్గ స్థాయి రాజకీయాల నుంచి వర్మను తప్పించి.. రాష్ట్ర స్థాయిలో ఆయన సేవలు వినియోగించుకోవాలని పార్టీ భావిస్తున్నట్లు కనిపిస్తోంది. మరి ఈ కొత్త కమిటీ ఏర్పాటు తర్వాత పిఠాపురంలో కూటమి రాజకీయాలు ఏ మలుపు తిరుగుతాయో వేచి చూడాలి.