ఏపీలో గంటకు125- 150 కిలోమీటర్ల వేగంతో విరుచుకుపడి అర్నబ్ అతి తీవ్ర తుపాను బీభత్సం సృష్టించిందనే చెప్పాలి. ఆ గాలివాన తీవ్రతకు దెబ్బతిన్న రోడ్లు, నేలకూలిన విద్యుత్ స్తంభాలు, ఎటు చూసినా నీటమునిగిన లోతట్టు ప్రాంతాలు కనిపిస్తున్నాయి. వచ్చింది కొన్ని గంటలే అయినా కూడా హుద్ హుద్ తుపాన్‌ను శాంపిల్‌గా చూపించింది.
ఇప్పుడు ఆ తుపాను గండం గడిచిపోయినట్లేనని వాతావరణ శాఖ చెప్పడంతో.. అంతా ఊపిరి పీల్చుకుంటున్నారు. అయితే ప్రజలు తమ డైలీ లైఫ్‌లోకి ఎలాంటి ఇబ్బందులు పడకుండా అడుగుపెట్టడానికి కొన్ని కీలకమైన భద్రతా నియమాలను అధికారులు స్పష్టం చేశారు.
ఎక్కడైనా సురక్షిత ప్రాంతాల్లో షెల్టర్లలో తలదాచుకున్న ప్రజలు.. అక్కడి నుంచి డైరెక్టుగా ఇళ్లకు వెళ్లిపోకూడదు.. ప్రభుత్వ అధికారులు లేదా విపత్తు నిర్వహణ బృందాలు అక్కడి ప్రజలతో ఇక పూర్తిగా సేఫ్ అని అధికారికంగా క్లియరెన్స్ ఇచ్చే వరకు ఎక్కడకూ కదలకుండా అక్కడే ఉండాలి.
అలాగే తుపాను ధాటికి రోడ్లపై ఎక్కడికక్కడ తెగిపడి వేలాడుతున్న విద్యుత్ తీగలను, నేల మీద కూలిన కరెంట్ పోల్స్‌ను పొరపాటున కూడా తాకొద్దు. ఒకవేళ అలాంటివి కనిపిస్తే వెంటనే స్థానిక అధికారులకు సమాచారం ఇవ్వాలి.
ఇక పాత గోడలు, బలహీనపడి ఊగిసలాడుతున్న కప్పులు ఉన్న ఇళ్లలోకి తొందరపడి అప్పుడే వెళ్లిపోవద్దు. అలాగే వర్షపు నీటితో ఉప్పొంగుతున్న డ్రైనేజీలతో, వర్షపునీటితో నిండిపోయిన రోడ్లపై నడుచుకుంటూ లేదంటే వాహనాలపై వెళ్లే సాహసం ఇంకా చేయకండి.
అంతేకాదు మరీ ముఖ్యంగా వరదల కారణంగా నీరంతా కలుషితమవుతాయి. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ బాగా కాచి చల్లార్చిన మంచినీటిని మాత్రమే తాగాలి. శుభ్రమైన ఆహారాన్ని మాత్రమే తీసుకుంటూ సీజనల్ వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తపడండి. ఎప్పటికప్పుడు వాతావరణ శాఖ ఇచ్చే తాజా హెచ్చరికలను ఫాలో అవుతూ అప్రమత్తంగా ఉండండి.
