ప్రకృతి కోపానికి ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతం నిలువెల్లా వణికిపోతోంది. అర్నబ్ రూపంలో వచ్చిన అతి తీవ్ర తుపాను నిన్నటి నుంచి అంటే అక్టోబర్ 27 నుంచి కోస్తాంధ్రను గడగడలాడిస్తోంది. బుధవారం తెల్లవారుజాము నుంచే బాపట్ల నుంచి విశాఖపట్నం మధ్య, ముఖ్యంగా యానాం దగ్గరలో ఈ రాక్షస తుపాను తీరం దాటడం ప్రారంభించింది.
ప్రస్తుతం కాకినాడ, యానాం పరిసరాల్లోనే కేంద్రీకృతమైన అర్నబ్, తీరప్రాంత ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేసింది. భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ తుపాను ఎఫెక్ట్‌తో గంటకు 125 – 135 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. ఒక్కోసారి ఈ గాలుల వేగం ఏకంగా 150 కి.మీ. భీకర స్థాయికి చేరుకుంటూ విధ్వంసాన్ని సృష్టిస్తోంది.
అయితే ఇక్కడ సముద్రంలో ఎదురవుతున్న అసలు ముప్పేంటంటే.. ఈ తుపాను గంటకు కేవలం 3 కి.మీ. అతి నెమ్మది వేగంతో వాయవ్య దిశగా కదులుతోంది. తుపాను ఎంత మెల్లగా కదిలితే, తీరం దాటే సమయం అంత ఎక్కువవుతూ బీభత్సం కూడా అంతే స్థాయిలో ఉంటుంది. ఈ తీరం దాటే ప్రక్రియ మరో 2,3 పాటు నరకప్రాయంగా కొనసాగొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. దీనికితోడు సముద్రంలో 1.5 నుంచి 2.5 మీటర్ల ఎత్తున ఎగిసిపడుతున్న రాక్షస అలలు లోతట్టు ప్రాంతాలను ముంచెత్తుతున్నాయి. ముఖ్యంగా కాకినాడ, యానాం, గోదావరి నదీ ముఖద్వారం వద్ద ఉప్పెన వంటి వాతావరణం కనిపిస్తోంది.
కాకినాడ పోర్టులో అత్యంత తీవ్రమైన 10వ నెంబర్ డేంజర్ సిగ్నల్‌ను ఎగరేయగా, విశాఖపట్నం, గంగవరం, భీమునిపట్నం ఓడరేవుల్లో 9వ నెంబర్ ప్రమాద హెచ్చరికలను జారీ చేశారు. ఇప్పటికే జాతీయ రహదారి 216పై భారీ వృక్షాలు కూలిపోయి రాకపోకలు స్తంభించాయి.
మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు తుపాన్ ప్రభావంపై సెక్రటేరియట్ నుంచి ఉన్నతాధికారులతో సమీక్షలు జరుపుతున్నారు. ఇటు ముందు జాగ్రత్త చర్యలలో భాగంగా ఏపీలోని 3 ప్రధాన విమానాశ్రయాల్లో ఫ్లైట్ సర్వీసులను పూర్తిగా రద్దు చేశారు.
