కోట్ల రూపాయల ఆస్తులు, రాజకీయ హోదా, భద్రతా సిబ్బంది, ఖరీదైన వాహనాలు.. ఇవన్నీ ఉన్నప్పటికీ మహారాష్ట్రకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే పరాగ్ షా ఒక్కరోజు సాధారణ బిచ్చగాడిగా మారారు. ఆయన చేసిన ఈ ప్రయోగం ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. డబ్బు, హోదా కంటే మానవత్వమే గొప్పదనే సందేశాన్ని ఈ ఘటన ఇచ్చిందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
రూ.3,383 కోట్లకు పైగా ఆస్తులు
రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్న పరాగ్ షా.. 2024 అసెంబ్లీ ఎన్నికల అఫిడవిట్లో తనకు రూ.3,383 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్లు ప్రకటించారు. సాధారణంగా ఆయన చుట్టూ భద్రతా సిబ్బంది, ఖరీదైన వాహనాలు, రాజకీయ హోదా కనిపిస్తుంటాయి. అయితే, ఆ హంగూ ఆర్భాటాలన్నింటినీ పక్కనపెట్టి.. ఒక రోజు మాత్రం సామాన్యుడి జీవితాన్ని అనుభవించాలని నిర్ణయించుకున్నారు.
తన ఆధ్యాత్మిక గురువు సూచన మేరకు జైన సంప్రదాయంలోని ప్రత్యేక మాసం సందర్భంగా ఈ ప్రయోగం చేసినట్లు తెలుస్తోంది. ముంబైలోని ఘట్కోపర్ ప్రాంతంలోని వీధుల్లో బిచ్చగాడి వేషంలో కూర్చున్నారు. తనను ఎవరూ గుర్తుపట్టకుండా మేకప్ వేసుకుని జాగ్రత్తలు తీసుకున్నారు. అనంతరం అక్కడికి వచ్చే ప్రజలను ఆహారం, డబ్బు అడుగుతూ కొంతసేపు గడిపారు.
ప్రజల స్పందనతో భావోద్వేగ అనుభవం
ఈ సమయంలో పలువురు ఆయనకు తమకు తోచినంత సహాయం చేశారు. ఓ వ్యక్తి రూ.20 ఇచ్చి.. “వెళ్లి తిను బాబా” అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. మరోవైపు, తన దగ్గర డబ్బులు లేవని చెప్పిన ఓ సమోసా వ్యాపారి.. డబ్బులు తీసుకోకుండానే చిరునవ్వుతో సమోసా ఇచ్చాడు. ఈ సంఘటన పరాగ్ షాను ఎంతగానో కదిలించినట్లు తెలుస్తోంది.
కొన్ని గంటల తర్వాత ఆయన మేకప్ తొలగించుకుని, తాను బిచ్చగాడి వేషంలో తిరిగిన ప్రాంతాలకే మళ్లీ వెళ్లారు. అక్కడి ప్రజలు తనను ఎలా చూశారు? ఎలాంటి ప్రవర్తన కనబరిచారు? అనే విషయాలను గమనించారు.
“అదే జీవితంలోని వాస్తవం”
ఈ అనుభవం గురించి పరాగ్ షా మాట్లాడుతూ.. “నన్ను కలవడానికి వచ్చే ప్రజలే.. నేను వారి దగ్గరకు వెళ్లినప్పుడు నాకంటే ఎత్తుగా కనిపించారు. అదే జీవితంలోని వాస్తవం” అని వ్యాఖ్యానించారు.
