కుమార్ చంద్ పుల్లగూర
ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న దుర్గమ్మ గుడిలో అవకతవకలు అంతర్గతంగా నానాటికీ పెరుగుతూనే ఉన్నాయి. పలు తీవ్రమైన సమస్యలతో దుర్గ గుడి ప్రస్తుతం సతమతమవుతూనే ఉంది. ఈవో స్థాయి వ్యక్తి కూడా వాటిని పరిష్కరించలేక తర్జనభర్జన పడుతున్నారని తెలుస్తోంది. ఇటీవలే కొందరు దేవస్థాన ఉద్యోగులు తెరతీసిన ఓ అవినీతి భాగోతం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ వరకూ వెళ్లడం, ఆయా ఉద్యోగులపై ఎఫ్ ఐ ఆర్ లు నమోదవ్వడం, వాటిని దేవస్థానం ఉన్నతాధికారులు గోప్యంగా ఉంచడం ప్రస్తుతం భక్తుల్లో ఆందోళనను పెంచే విధంగా ఉన్నాయనే చెప్పాలి. భారతదేశంలో ఉన్న శక్తి దేవాలయాల్లో ప్రత్యేక స్థానం కలిగి ఉన్న విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న దుర్గమ్మ దేవాలయం రాను రానూ కొందరు అవినీతిపరుల స్వార్ధాలకు నష్టపోయే విధంగా తయారయ్యిందనే చెప్పాలి. స్వయంగా కొందరు దేవాలయ ఉద్యోగులు చేస్తున్న స్కామ్ లకు ఉన్నతాధికారులు సపోర్ట్ చేస్తుండటం.. అస్సలు వారికి వీరికి మధ్య ఏం లాలూచీలు ఉన్నాయా అన్న అనుమానాలను రేకెత్తిస్తోంది. అస్సలు దుర్గ గుడిలో జరిగిన.. అదేవిధంగా జరుగుతూ ఉన్న ఆ స్కామ్ ను వివరాలతో సహా మీముందుకు తెస్తోంది మీ ట్రూ పాయింట్ మీడియా. ఆ వివరాలేంటో ఈ రోజు ప్రత్యేక కథనంలో చూద్దాం..
స్కామ్ ఎలా జరిగిందంటే..:-
ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న కనకదుర్గమ్మ దేవస్థానానికి నిత్యం దూర, సుదూర ప్రాంతాల నుంచి కొన్ని వేల మంది భక్తులు అమ్మవారి దర్శనం కోరి వస్తుంటారు. అమ్మలగన్న అమ్మ.. ముగ్గురమ్మల మూలపుటమ్మ అయిన కనకదుర్గమును దర్శించుకున్న అనంతరం తమ కోరికలు సిద్ధిస్తాయని నమ్ముతుంటారు. అటువంటి అమ్మవారి దర్శనం కోసం వచ్చే భక్తుల నుంచీ తాము దర్శనాలు చేపిస్తామని చెప్పి టిక్కెట్ రుసుమును వసూలు చేసి.. ఆ రుసుమును దేవస్థానానికి చెల్లించకుండా.. తమ జేబులు నింపుకుంటున్నారు కొందరు దుర్గగుడి ఉద్యోగులు. ఇది కనకదుర్గమ్మ అమ్మవారి స్కానింగ్ పాయింట్ వద్ద జరుగుతున్న బాగోతం. ఇక్కడ ఇంకొక అనుమానం తలెత్తవచ్చు.. అదేంటంటే స్కానింగ్ పాయింట్ వద్ద భక్తుల ముఖ చిత్రాలు నమోదు అవుతాయి కాబట్టి.. ఆ విధంగా పంపించడం ఎలా సాధ్యం అని అనుమానం రాకపోదు. కానీ స్కానింగ్ పాయింట్ వద్ద ముఖచిత్రాల గుర్తింపు అనేది లేదు.. దుర్గగుడి ఉద్యోగులు ఎవరినైతే పంపిస్తారో.. వారిని ఆయా లైన్లో తరలించడం జరుగుతుంది. ఈ విధంగా కొందరు దుర్గగుడి ఉద్యోగులు టికెట్ రుసుములను తమ జేబుల్లో నింపుకుంటూ.. దుర్గగుడి ఆదాయానికి గండి కొడుతూ.. స్కాములకు పాల్పడుతున్నారు. ఇక ఇటీవల కొన్ని నెలల క్రితం ఈ విషయాన్ని గుర్తించిన ఈవో వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న వన్ టౌన్ సీఐ కూడా ఎఫ్ఐఆర్ లను నమోదు చేశారు.
విషయం పొక్కకుండా.. జాగ్రత్తలు:-
కానీ ఈ విషయం బయటకు పొక్కకుండా దుర్గగుడి ఉన్నతాధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. స్కామ్ చేసిన ఉద్యోగులను వేరే దేవాలయాలకు కూడా బదిలీ చేశారు. విషయం సర్దు మణిగేసరికి మళ్ళీ దుర్గ గుడిలోకి రెడ్ కార్పెట్ వేసి మరీ స్వాగతం పలికారు. దుర్గ గుడిలో కొందరు ఉద్యోగులు ఫోన్ పే లలో భక్తుల నుంచీ డబ్బులు గుంజారని తెలిసినా ఆ ఉద్యోగులపై క్రమశిక్షణా చర్యలు కూడా తీసుకోకపోగా.. సదరు స్కాం నుంచీ ఉద్యోగులను రక్షించే దిశగా ఏ ఈ ఓ స్థాయి వ్యక్తి కూడా ప్రయత్నాలు చేయటం కూడా గమనార్హం. మీడియాకు తెలియకుండా ఈ విషయాలన్నిటినీ కప్పిపుచ్చుతూ దుర్గగుడి ఉన్నతాధికారులు విషయాన్ని కప్పిబుచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
వివరణ కోరగా..:-
ఇదే విషయాలను గుర్తించిన ట్రూ పాయింట్.మీడియా దుర్గగుడి ఉన్నతాధికారి ఒకరిని వివరణ కోరగా.. సదరు స్కామ్ సంబంధించిన అంశాలను పోలీసువారి విచారణలో ఉన్నదని, కామెంట్ చేయలేమని వివరణ ఇచ్చారు. అయితే ఇప్పటివరకూ ఈ స్కామ్ కు సంబంధించిన వివరాలను బయటకు కూడా ఇవ్వలేదు. ఎఫ్ ఐ ఆర్ నమోదయి ఇన్ని నెలలయినా.. దోషులపై ఎటువంటి క్రమశిక్షణా చర్యలను చేపట్టారో ఇంతవరకూ క్లారిటీ లేదు. మొత్తంగా చూసుకుంటే దుర్గ గుడి ఉద్యోగులతో పాటు బోర్డ్ మెంబర్స్ కూడా ఇదే తరహాలో భక్తులను తరలిస్తున్నారని దర్శనాలు చేయిస్తున్నారన్న ఆరోపణలు దుర్గగుడి ఉద్యోగుల నుంచే వస్తోంది. ఇక ఇటీవలే దుర్గ గుడిలో లడ్డూల స్కామ్ బయట పడినా.. ఇప్పటి కూడా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవడం లేదు.
దసరా ఉత్సవాలకు ఏం తెరతీయబోతున్నారో..:-
దుర్గ గుడికి వచ్చే ఆదాయంలో అగ్ర భాగం ఏటా నిర్వహించే దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు వచ్చే ఆదాయం నుంచే వస్తోంది. అటువంటి ఉత్సవాలకు లక్షలాది మంది భక్తులు తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. ఈ ఉత్సవాలకు గానూ ముందుగానే ప్రణాళికలను సిద్ధం చేసుకుంటారు ఆలయ ఉన్నతాధికారులు. వివిధ డిపార్టుమెంట్ల సహకారంతో ఉత్సవాలను పూర్తి చేస్తారు. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేది ఉత్సవాలకు లక్షల మంది భటులు తరలివస్తారు. ఈ ఉత్సవాలలో కూడా దుర్గ గుడి ఉద్యోగులు తమ చేతి వాటాన్ని చూపించే పరిస్థితి లేకపోలేదు. మరి దీనిపై ఒక పక్కా ప్రణాళికను సిద్ధం చేసుకుని ఉన్నతాధికారులు ముందుకు వెళ్తారో లేక మనకేం కాదులే అని నత్త నడకన నడుస్తారో వేచి చూడాలి.
