బ్రిక్స్ డిక్లరేషన్ (BRICS Declaration) కోసం సభ్య దేశాల మధ్య ఏకాభిప్రాయం కుదిరినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఏ దేశం పేరును ప్రస్తావించకుండా.. ఏ దేశమైనా చేపట్టే ఏకపక్ష యుద్ధాన్ని ఖండిస్తూ ఉమ్మడి ప్రకటన విడుదల చేయడానికి బ్రిక్స్ దేశాలు అంగీకరించినట్లు సమాచారం. ఈ మేరకు సభ్య దేశాల ప్రతినిధులు చర్చలు జరుపుతున్నారు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం నేపథ్యంలో ఇరాన్ (Iran), యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) మధ్య నెలకొన్న విభేదాలను పరిష్కరించేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. చర్చలు పూర్తయిన అనంతరం బ్రిక్స్ దేశాల అధినేతలు ఏకాభిప్రాయ ప్రకటనను ఆమోదించే అవకాశం ఉంది.
సదస్సులో ఆర్థిక సహకారం, ఇంధనం, ఆహార భద్రత, సాంకేతికత, ప్రపంచ సంస్థల్లో సంస్కరణలు వంటి కీలక అంశాలపై చర్చలు జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా అమెరికా డాలర్‌పై ఆధారపడటాన్ని తగ్గించి, పరస్పర వాణిజ్యం, చెల్లింపుల్లో సభ్య దేశాల సొంత కరెన్సీల వినియోగాన్ని పెంచడంపై దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది. అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల మధ్య సహకారాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా బ్రిక్స్ ముందుకు సాగుతోంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో సమతుల్యత సాధించేందుకు ఈ కూటమి కీలక వేదికగా మారుతోందని చైనా, రష్యా భావిస్తున్నాయి. అయితే ఉమ్మడి ప్రకటనలో తుది పదజాలం, అన్ని సభ్య దేశాల ఆమోదం కీలకంగా మారనున్నాయి.
