శ్రీవారి భక్తులకు తితిదే కీలక ప్రకటన చేసింది. డిసెంబర్ నెలకు సంబంధించిన ఆర్జిత సేవలు, దర్శన టికెట్ల కోటాను ఈ నెల 19 నుంచి 24వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు తెలిపింది. భక్తులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవాలని సూచించింది.
సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవల కోటాను ఈ నెల 19న ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు. ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్‌కు 21వ తేదీ ఉదయం 10 గంటల వరకు అవకాశం ఉంటుంది.
కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ, పుష్పయాగం టికెట్లను 22న ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు. వర్చువల్ సేవలు, దర్శన స్లాట్ల కోటా అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు అందుబాటులోకి వస్తుంది.
23న అంగప్రదక్షిణం, శ్రీవాణి ట్రస్టు బ్రేక్ దర్శనం, వృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులకు ఉచిత ప్రత్యేక ప్రవేశ దర్శన టోకెన్లను విడుదల చేస్తారు. 24న రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు, అద్దె గదుల బుకింగ్ కోటా విడుదల కానుంది.
టికెట్ల కోసం టీటీడీ అధికారిక వెబ్‌సైట్ ను సందర్శించాలని అధికారులు సూచించారు. మరోవైపు, శ్రీవారి సాలకట్ల, నవరాత్రి బ్రహ్మోత్సవాలకు సీఎం చంద్రబాబును తితిదే ఆహ్వానించింది. ఏర్పాట్లు, భక్తుల సౌకర్యాలు, భద్రతా చర్యలపై ముఖ్యమంత్రితో చర్చించింది.
