ఉభయ తెలుగు రాష్ట్రాల మధ్య నదీ జల వివాదాలు రోజురోజుకూ తీవ్రంగా మారాయి. ఇందుకు ప్రధానంగా కేంద్ర జలశక్తి శాఖతో పాటు గోదావరి – కృష్ణా యాజమాన్య బోర్డుల క్రియారాహిత్యం కూడా ఒక కారణం. చట్టబద్ధత గల ఈ సంస్థలు ఆచరణలో పోస్టాఫీసు పని చేయడానికి అలవాటుపడ్డాయి. ఈ విషయంలో కేంద్ర జలశక్తి శాఖ నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది. రాష్ట్ర విభజన చట్టం సబ్ సెక్షన్ (1), సెక్షన్ 84 మేరకు అపెక్స్ కౌన్సిల్ ఎప్పటికప్పుడు రెండు నదీ యాజమాన్య బోర్డుల పని తీరును అజమాయిషీ చేయాల్సి ఉంది. నదీ బోర్డులపై అపెక్స్ కౌన్సిళ్లకు అధికారముందని మన ముఖ్యమంత్రులకు తెలిసినట్లు లేదు. పన్నెండేళ్ల కాలంలో రెండుసార్లు మాత్రమే అపెక్స్ కౌన్సిల్ సమావేశాలు జరిగాయి. దీనికి తోడు రెండు రాష్ట్రాల ప్రజల ప్రయోజనాలు పరస్పర విరుద్ధంగా ఉండటంతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నిరాసక్తిగా ఉన్న బోర్డులతో నిమిత్తం లేకుండా తమ అవసరాలు తీర్చుకుంటున్నాయి. ఫలితంగా ఎల్‌నినో ప్రభావం, రానున్న నీటి ఎద్దడి, వచ్చే వేసవి. వీటితో నిమిత్తం లేకుండా శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాలు ఖాళీ చేస్తున్నారు.
ఈ ఏడాది ఎల్‌నినో వల్ల వర్షాలు పడవని, సాగునీటికి కాదు కదా, తాగునీటికి కూడా కటకటలాడాల్సి ఉంటుందని లోకం కోడై కూస్తున్నా.. కృష్ణానది యాజమాన్య బోర్డులో చలనం లేదు. నీటి సంవత్సరం జూన్ నుంచి ప్రారంభమైనా, ఇంతవరకు బోర్డు పూర్తిస్థాయి సమావేశం జరగలేదు. త్రిసభ్య కమిటీ అంటూ ఆ మధ్య ఒక సమావేశం జరిగింది. రెండు రాష్ట్రాల మధ్య పొంతన కుదరకపోవడంతో వాయిదా వేశారు. తిరిగి ఈ నెల 4న అదే త్రిసభ్య కమిటీ సమావేశం జరిగింది. ఒక దఫా త్రిసభ్య కమిటీ సమావేశంలో పొంతన కుదరనప్పుడు మళ్లీ త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేయడం బోర్డు సభ్య కార్యదర్శి బాధ్యతారాహిత్యాన్ని సూచిస్తోంది. ఇదిలా ఉండగా జల వివాదాల పరిష్కారానికి ఏర్పడిన కేంద్ర కమిటీ సమావేశం ఎజెండా పైనే కుస్తీ పడుతోంది. ఇటీవల త్రిసభ్య కమిటీ సమావేశంలో రెండు రాష్ట్రాలూ ఎవరి వాదనకు వాళ్లు కట్టుబడగా, ఈ నెల ఆఖరు వారంలో బోర్డు సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు.
పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి ఆంధ్రప్రదేశ్ నీటిని తరలించడం నిలిపివేయాలని తెలంగాణ చేసిన ఫిర్యాదును ఆంధ్రప్రదేశ్‌కు, తెలంగాణ విద్యుదుత్పత్తి చేస్తూ శ్రీశైలం నుంచి కిందకు నీళ్లు వదిలేస్తుందని ఆంధ్రప్రదేశ్ చేసిన ఫిర్యాదును తెలంగాణకు.. యాజమాన్య బోర్డు పంపింది. కనీసం బోర్డు సభ్య కార్యదర్శి రెండు రాష్ట్రాలూ తమ అనుమతి లేకుండా ఎవరి వాటా ఎంతో తేల్చే యాజమాన్య బోర్డు పంపింది. కనిసం బొర్డు సభ్య కార్యదర్శి రెండు రాష్ట్రాలూ తమ అనుమతి లేకుండా ఎవరి వాటా ఎంతో తేల్చే వరకు ఆగాలని హెచ్చరించి ఉండవచ్చు. నీటి సంవత్సరం మొదలై మూడు నెలలు గడుస్తున్నా పూర్తిస్థాయి బోర్డు సమావేశం జరగలేదు. అయినా రాష్ట్రాల ప్రజల అవసరాలు మాత్రం ఆగవు కదా? ఈ లోపు రాయలసీమలో తీవ్ర ఆందోళన మొదలైంది.
ఈ ఏడాది సాగునీరు మాట అటుంచి, తాగునీటికి కూడా వలసలు పోయే దుస్థితి ఏర్పడుతుందని, శ్రీశైలం జలాశయం ఖాళీ చేస్తున్నారని ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ నెల 10 నాటికి శ్రీశైలం నీటిమట్టం 866 అడుగులకు చేరింది. ఈ నెల నాలుగున త్రిసభ్య కమిటీ సమావేశం ముగిస్తూ అప్పటికి మేల్కొన్న బోర్డు సభ్య కార్యదర్శి.. శ్రీశైలం నుంచి తెలంగాణ విద్యుదుత్పత్తి నిలిపివేయాలని, ఆంధ్రప్రదేశ్ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి నీటి విడుదల ఆపాలని ఆదేశాలు ఇచ్చారు. ఇదిలావుండగా ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇరిగేషన్ శాఖపై సమీక్ష చేస్తూ శ్రీశైలం జలాశయం నుంచి ఆంధ్రప్రదేశ్ మల్యాల, ముచ్చుమర్రి తదితర అవుట్ లెట్ల నుంచి నీటిని తరలిస్తున్నందున తాము విద్యుదుత్పత్తి చేసేందుకు శ్రీశైలం జలాశయంలో నీళ్లు ఉండడం లేదని, అందుకు ఏపీ నుంచి పరిహారం కోరేందుకు ప్రస్తుతం విచారణ జరుపుతున్న ట్రిబ్యునల్ వద్ద ప్రస్తావించాలని తమ అడ్వొకేట్‌ను కోరారు.
ఈ పరిస్థితుల్లో తెలంగాణ విద్యుదుత్పత్తి నిలిపివేస్తుందని భావించగలమా? దేశంలో పలు రాష్ట్రాలు ఉమ్మడిగా అనుభవించే ప్రాజెక్టులు ఉన్నాయి. అయితే ఏపీ, తెలంగాణలాగా ఈ రాష్ట్రాలు రచ్చకెక్కడం లేదు. నీళ్లతో రాజకీయాలు మిళితమైనందున తెలుగు రాష్ట్రాల్లో ఈ పరిస్థితి తటస్థించింది. రాష్ట్ర విభజన జరిగిన అరవై రోజుల లోపు గోదావరి, కృష్ణా నదీ యాజమాన్య బోర్డులు ఏర్పాటు చేయాలని రాష్ట్ర విభజన చట్టం చెబుతోంది. కేంద్ర ప్రభుత్వం తొలుత బోర్డుల నియామకానికే బాగా కాలయాపన చేసింది. ఈ లోపు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. రెండు రాష్ట్రాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. రాష్ట్ర విభజన చట్టం సబ్ సెక్షన్ 8, సెక్షన్ 85లోనే యాజమాన్య బోర్డుల విధుల కోసం స్పష్టంగా ఉంది. ఏడేళ్ల తర్వాత 2021 జూలై 15న ప్రాజెక్టులను బోర్డులకు అప్పగించాలని కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది.
కానీ ఈ రోజుకూ అమలు చేయలేకపోతోంది. ట్రిబ్యునల్ తీర్పు వచ్చే వరకు ప్రాజెక్టులను స్వాధీనం చేయబోమని తెలంగాణ మొండికేసింది. శ్రీశైలం రిజర్వాయర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆధీనంలో, నాగార్జునసాగర్ రిజర్వాయర్ తెలంగాణ రాష్ట్ర ఆధీనంలో ఉన్నాయి. సాగర్ డ్యాం పైన రెండు రాష్ట్రాల పోలీసులు ఇంజనీరింగ్ అధికారులు మోహరించిన ఘటనలు సాగునీటి చరిత్ర పుటల్లో మాయని మచ్చ. చివరికి శ్రీశైలం, సాగర్ రిజర్వాయర్లకు రూల్ కర్వ్.. ఆపరేషన్ షెడ్యూల్‌ను యాజమాన్య బోర్డు నిర్ణయించింది. ఇందులో శ్రీశైలం జలాశయం కనీసం నీటిమట్టం 854 అడుగులుగా నిర్ణయించింది రూల్ కర్వ్నకు మొత్తంగా తెలంగాణ ఆమోదం తెలుపలేదు. కనీసం శ్రీశైలం జలాశయం రూల్ కర్వ్నకు ఇరు రాష్ట్రాలు అంగీకరించి ఉంటే ఏడాది ఈ పరిస్థితి ఏర్పడేది కాదు.
